పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో పోటీ చేస్తానని దాని కోసం సినీ రంగానికి గుడ్ బై చెప్పేస్తానని ప్రకటించేశారు కనుక ఆయన రాజకీయాలలో ఏవిధంగా ముందుకు సాగాబోతున్నారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఆయన సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న అగ్ర నటులలో ఒకరయినప్పటికీ, నెలవారీ ఖర్చులకి కూడా ఇబ్బందిపడుతున్నట్లు చెప్పుకొన్నారు. అందుకు కారణాలు ఎవయినప్పటికీ ఈ విషయంలో ఆయనని సందేహించనవసరం లేదనే భావించవచ్చును. కానీ అయన పదేపదే తన ఆర్ధిక పరిస్థితి బాగోలేదని అయినా రాజకీయాలలోకి వస్తానని చెపుతుండటం రాజకీయలలో ఉన్నవారికి తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లవుతోంది. ఎవరయినా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే
తను రాజకీయాలలోకి రావడానికి సిద్దంగా ఉన్నానని చెపుతున్నట్లుంది.
ఇదివరకు ఆయన జనసేన పార్టీని ప్రారంభించడానికి ఒక ప్రముఖ నిర్మాత పెట్టుబడి పెట్టినట్లు, అందుకే ఆయనకి విజయవాడ లోక్ సభ సీటు కేటాయించమని పవన్ కళ్యాణ్ తెదేపాని కోరినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చేయి. ఆ నేపధ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సమస్యల గురించి మాట్లాడితే అందరికీ అదే భావన కలగడం సహజం.
పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే, ఆయన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కూడా ఈ కారణంగానే తీవ్ర అప్రదిష్ట మూటగట్టుకొందని. నేటి రాజకీయాలను శాశిస్తున్నవి 1. కులం, 2. డబ్బు. ఈ రెంటినీ కాదని ఏ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. అందుకు లోక్ సత్తా పార్టీ రాజకీయ నిష్క్రమణే ఒక ఉదాహరణ. కనుక పవన్ కళ్యాణ్ బాగా ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది.
ఆయన సదుదేశ్యంతోనే పార్టీని స్థాపించాలని అనుకోవచ్చును. కానీ ఈ రెండు సవాళ్ళను అధిగమించడానికి తగిన ఉపాయం ఉన్నట్లయితేనే అడుగు ముందుకు వేయడం మంచిది. సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్నా ఆర్ధిక సమస్యలని అధిగమించలేకపోతున్నప్పుడు, చాలా భారీగా ఖర్చు చేయవలసిన రాజకీయాలలోకి దిగాలనుకోవడం చాలా ప్రమాదకరమే.
మూడున్నరేళ్ళు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, నాలుగు దశాబ్దాలుగా ప్రజలను రంజింపజేసి అపూర్వ ప్రజాధారణ పొందిన చిరంజీవి, అపార రాజకీయ, పరిపాలనానుభావం కల జయప్రకాష్ నారాయణ వంటివారు రాజకీయాలలో నిలద్రొక్కుకోలేకపోయారు. అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విఫలపోరాటం చూస్తూనే ఉన్నాము. కొమ్ములు తిరిగిన తెదేపా-భాజపా-కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న రాజకీయ పోరాటాలను చూస్తూనే ఉన్నాము. వచ్చే ఎన్నికలు వాటన్నిటికీ జీవన్మరణ సమస్యవంటివి కనుక అవి అధికారం కోసం ఎంతకయినా తెగిస్తాయి. కుల సమీకరణాలు, పెట్టుబడి సమస్యలను పవన్ కళ్యాణ్ ఎలాగో అధిగమించినా, ఈ దేశముదురు రాజకీయ పార్టీల నుంచి పోటీని, అవి చేసే రాజకీయాలను తట్టుకొని నిలబడటం చాలా కష్టం. ఒకవేళ వచ్చే ఎన్నికలలో కూడా ఏవో కారణాలు చూపి పవన్ కళ్యాణ్ మళ్ళీ వెనక్కి తగ్గినట్లయితే ఆయన ప్రతిష్టే మసకబారుతుంది.
ఒకవేళ అలా కాకూడదు అంటే అయన ముందు రెండు మార్గాలున్నాయి. 1. రాజకీయాల నుంచి శాస్వితంగా తప్పుకోవడం. 2. తక్షణమే సినిమాలకి గుడ్ బై చెప్పేసి తన జనసేన పార్టీని నిర్మించుకొనే పని మొదలుపెట్టడం. ఈ రెండూ సాధ్యంకావని అనుకొంటే మాత్రం అందుకు ఆయన చాలా భారీ మూల్యం చెల్లించవలసిరావచ్చును. కనుక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో రావలనుకొంటే ఏదో ఆవేశంతో నిర్ణయం తీసుకోకుండా తన శ్రేయోభిలాషులతో లోతుగా చర్చించి నిర్ణయం తీసుకొంటే మంచిది.