ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం “బోడిలింగం” విమర్శల సీజన్ నడుస్తోంది. హఠాత్తుగా రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా వేడెక్కింది. వివరాల్లోకి వెళితే..
నానీలకు పవన్ పంచ్ :
కృష్ణా జిల్లా పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ సిపి నేతలు కొడాలి నాని, పేర్ని నాని తదితరులను ఉద్దేశించి శతకోటి లింగాల్లో బోడిలింగం అన్నట్లుగా, వైయస్సార్ సిపి లో ఉన్న అనేక మంది నానీలలో ఈ నాని ఒకరు అంటూ మొదలు పెట్టి, కొడాలి నాని పేర్ని నాని లపై విమర్శల వర్షం కురిపించారు. గుడివాడ రోడ్లు మొత్తం గుంతల మయం అవుతుంటే కొడాలి నానికి పేకాట క్లబ్ మీద ఉన్న శ్రద్ధ రోడ్లమీద లేదంటూ దుయ్యబట్టారు. అదేవిధంగా పేర్నినానిని కూడా విమర్శించడంతో, వైకాపా నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా చేసుకుని రెండు చోట్ల ఓడిపోయిన నువ్వు మాకు చెప్పేది ఏంటి ప్యాకేజీ స్టార్ అంటూ తీవ్ర విమర్శలు కురిపించారు. దాంతోపాటు బోడి లింగం అన్న పదం వాడడం ద్వారా పవన్ కళ్యాణ్ శివలింగాన్ని అవమానపరచాడంటూ విచిత్రమైన లాజిక్కులు తీసుకొని వచ్చారు.
ట్రాక్ మార్చిన జనసేన నేతలు:
అయితే జనసేన నేతలు కూడా ఇటీవల ట్రాక్ మార్చినట్లుగా కనిపిస్తోంది. బూతులు వాడకపోయినా వైఎస్ఆర్సిపి నేతలకు దీటైన స్థాయిలో బదులు చెబుతున్నారు. జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి, ” శివలింగానికి బోడిలింగంకి తేడా తెలియదు, కాంపెన్సేషన్ కి ఇన్పుట్ సబ్సిడీకి తేడా తెలియదు, విమర్శ చేయడానికి బూతులు తిట్టడానికి తేడా తెలియదు, ఈ వైకాపా నేతలు అందరూ బోడిలింగం భజన బ్యాచ్ లా ఉన్నారు” అంటూ విమర్శిస్తే, జనసేన ప్రతినిధి పోతిన మహేష్ కొడాలి నాని పాత జీవిత చరిత్ర దగ్గర నుండి మొదలెట్టి విమర్శలు చేశారు.
కొడాలి నాని చిట్టా బయటికి తీసిన జనసేన ప్రతినిధులు
జనసేన నేత పోతిన మహేష్ కొడాలి నాని గురించి మాట్లాడుతూ, ” లారీ క్లీనర్ ఎమ్మెల్యే అయ్యాడని మాకు ఆనందంగా ఉంది, కానీ ఇంకా నీ బ్రతుకు దాబాల దగ్గర సిగరెట్ పీకలు ఏరుకునే స్థాయి దగ్గరే ఆగిపోయింది, నువ్వు మారాలి కొడాలి నాని. నీకు అప్పు ఇచ్చిన పాపానికి వంకా విజయ్ అనే వ్యక్తి రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమా కాదా? ఇప్పుడు చెప్పు నువ్వు శల్యుడివా లేక బోడి లింగమా కొడాలి నాని . ఖైదీ సాబ్ పాలనలో రాష్ట్రమంతా అల్లకల్లోలం అయిపోయింది, ప్రజలందరూ అవస్థలు పడుతుంటే బూతుల మంత్రి కొడాలి నాని ఇష్టమొచ్చినట్లు వాగుతున్నాడు. సన్నబియ్యం సరఫరా చేయలేని సన్నాసి మంత్రివి, నువ్వు శివలింగం ఏంటి బోడిలింగం గాడివి నువ్వు . నమ్ముకున్న వారందరినీ మోసం చేసిన కొడాలి నాని ఖచ్చితంగా బోడి లింగం అని మరోసారి చెప్తున్నాను “. అంటూ విమర్శలు కురిపించారు.
పేర్ని నాని, వెల్లంపల్లి పై ఘాటైన విమర్శలు
అదేవిధంగా పేర్ని నాని గురించి మాట్లాడుతూ, ” కాపు కార్పొరేషన్ నిధులను నవరత్నాల కు మళ్లిస్తుంటే నోరు మెదపలేని పేర్ని నాని నిజంగా బోడి లింగమే అంటూ విమర్శించారు. అదేవిధంగాా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్్ పై కూడా జనసేన నేతలు విరుచుకుపడ్డాారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబంపై ఏకవచనంతో మాట్లాడుతూ విమర్శించడానికి సిగ్గులేదా అంటూ ఘాటైన పదజాలంతో శ్రీనివాస్ ని విమర్శించారు జనసేన నేతలు. దుర్గగుడిలో పాత ఇనుము అమ్మకంతో శ్రీనివాస్ కు సంబంధం ఏమిటో, చీమకుర్తి గనుల్లో పెట్టుబడులకు వెల్లంపల్లి కి సంబంధం ఏమిటో త్వరలోనే బయటపెడతామని విమర్శించారు జనసేన నేతలు.
ఇక మరొక జనసేన నేత మాట్లాడుతూ, “సాక్ష్యాత్తు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీ సాక్షిగా 17 లక్షల ఎకరాల నష్టపోయింది అని చెప్పి, ఇప్పుడు 11లక్షల ఎకరాలకు దానిని కుదించారు ఇదేనా రైతులపై మీకున్న చిత్తశుద్ధి, రైతుల విషయంలో బేరాలు ఆడుతారా ” అంటూ విమర్శించారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అడిగింది రైతులకు న్యాయం చేయమని దాని గురించి తప్ప అన్ని విషయాలు మాట్లాడుతారు ఈ వైకాపా నాయకులు అంటూ వ్యాఖ్యలు చేశారు జనసేన నేతలు.
మొత్తం మీద వైఎస్సార్సీపీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, దానికి వైకాపా నేతల ప్రతి విమర్శలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.