దేశంలో ఏమూల చూసినా… ఏ రాష్ట్రాన్ని చూసినా ఒకటే దృశ్యం కనిపించింది. అదే నిర్మానుష్యం. అందులో ఉన్నది కర్ఫ్యూతో కరోనాను ఎదురించి గెలవాలన్న సంకల్పం…! వైరస్ పుట్టిన చైనాలోని వుహాన్ లో ఇప్పుడు … కరోనా అడ్రస్ లేకుండా పోవడానికి కారణం.. ఈ జనతా కర్ఫ్యూనే. కాకపోతే.. దీన్ని అక్కడి ప్రభుత్వం బలవంతంగా అమలు చేసింది. ఇక్కడ ప్రజలు స్వచ్చందంగా పాటిస్తున్నారు. దేశ ప్రజల్లో సహజంగా ఉండే.. నిర్లక్ష్యం కారణంగా ఎక్కువ మంది స్వీయ నిర్బంధాలను పాటించడం లేదు. అందుకే స్వీయ నిర్బంధాన్ని అలవాటు చేయడంలో భాగంగా జనతా కర్ఫ్యూ కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశం కరోనా వైరస్ రెండో దశలోనే ఉంది. మూడో దశకు చేరితే.. ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. ఈ పరిస్థితి చేజారిపోతే అది నాలుగో దశ. ఇటలీ లాంటి దేశాలు ఇప్పుడు నాలుగో దశలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి జనతా కర్ఫ్యూ ఓ ముందు జాగ్రత్త. దీన్ని.. సక్సెస్ చేసి ప్రజలు.. తమ సంకల్పం ఏమిటో చూపించగలిగారు..
ప్రజంలతా ప్రస్తుత స్ఫూర్తిని కొనసాగిస్తే.. వీలైనంత వరకూ.. కరోనా పాజిటివ్ కేసులు తగ్గించడానికి అవకాశం ఉంది. ఒక వేళ జనం ఎప్పటిలాగే తిరుగుతూ ఉంటే మాత్రం.. ఒకరి ద్వారా ఒకరికి శరవేగంగా వ్యాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే. తీవ్రమైన కష్టనష్టాలున్నప్పటికీ.. లాక్ డౌన్కే రాష్ట్రాల ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయి. ముందు ముందు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయికాబట్టి… దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించాల్సిన అవసరం ఏర్పడవచ్చని కూడా చెబుతున్నారు. ఈ దిశగా ప్రజలను సన్నద్ధం చేయడానికే.. జనతా కర్ఫ్యూకి ప్రధానమంత్రి పిలుపునిచ్చారని అనుకోవచ్చు.
ప్రస్తుతం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కరోనాపై యుద్ధాన్ని ప్రకటించాయి. వీలైనంతగా… వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర సూచనలకు అనుగుణగా వైరస్ పై పోరాటాన్ని చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా… తాము సిద్ధమన్న సందేశాన్ని ప్రజలు… జనతా కర్ఫ్యూని సక్సెస్ చేయడం ద్వారా.. తమ పట్టుదలను ప్రదర్శించారు. కరోనా నుంచి ప్రజల్ని కాపాడేందుకు అకుంఠితంగా శ్రమిస్తున్న యోధులందరికీ.. ప్రజలు సాయంత్రం ఐదు గంటలకు.. చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. తమ కోసం చేస్తున్న పోరాటంలో.. తామే సైనికులమవడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చేశారు.