జనతా గ్యారేజ్ మానియా ఓ రేంజుకు చేరుకొంది. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హంగామా ఆల్రెడీ మొదలైపోయింది. ఫ్యాన్స్ షో టికెట్ల కోసం ఎగబడున్నారంతా. ఒక్కో టికెట్ రూ.2000 వరకూ పలుకుతోంది. మరి జనతా గ్యారేజ్ కి బడ్జెట్ ఎంతయ్యింది? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? అనే లెక్కలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.55 కోట్ల వరకూ అయ్యిందని టాక్. పారితోషికాలకే దాదాపుగా రూ.30 కోట్లు తేలాయట. నైజాంలో ఈ సినిమాకి రూ.15 కోట్లకు అమ్మేశారు. ఓవర్సీస్లో రూ.5 కోట్ల పైచిలుకు బిజినెస్ జరిగింది. శాటిలైట్ హక్కుల క్రింద రూ.12.5 కోట్లు ముట్టాయి. మొత్తానికి రూ.77 కోట్ల వరకూ బిజినెస్ జరిగి ఉంటుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు గడుతున్నాయి. ఈ సినిమాకొచ్చిన క్రేజ్ దృష్ట్యా అన్ని ఏరియాల్లోనూ భారీ మొత్తాన్ని వెచ్చించి బయ్యర్లు రైట్స్ చేజిక్కించుకొన్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా.. ఎన్టీఆర్ సినిమాల్లోనే ఇది రికార్డు. నాన్నకు ప్రేమతో సినిమా రూ.50 కోట్ల దగ్గరే ఆగిపోయింది. దానికి మించి ఈ సినిమాకి ఖర్చు పెట్టడం, బిజినెస్ కూడా అదే రేంజులో జరగడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. తొలి రోజున రూ.20 కోట్లు రాబట్టాలని చిత్రబృందం స్కెచ్చులు వేసింది. తొలి నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల బిజినెస్ జరగొచ్చని అంచనా. ఈ అంచనాలన్నీ నిజం అయితే.. ఎన్టీఆర్ ఖాతాలో మరో రూ.50 కోట్ల సినిమా చేరిపోయినట్టే.