ఎన్టీఆర్ ఆశలన్నీ జనతా గ్యారేజీపైనే. ఈ సినిమాకొస్తున్న బజ్ మామూలుగా లేదు. ఫస్ట్ లుక్ అదిరింది. టీజర్ అదుర్స్ అనిపించింది. ఎన్టీఆర్ డైలాగు.. కెవ్వు కేక! ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజులో జరుగుతోంది. మొత్తానికి టీమ్ అంతా హ్యాపీనే. కాకపోతే.. ఈ సినిమా గురించి బయటకు వస్తున్న పిట్ట కథలు చూస్తేనే కాస్త కంగారు పుడుతోంది. జనతా గ్యారేజీ కథ.. గాయం, బాషా. ప్రస్థానం.. ఇలా కొన్ని పాత సినిమాల కథల్ని గుర్తు చేసేలా ఉంటుందట. ఫ్యామిలీలో ఉండే… ఆధిపత్య పోరు ఈ సినిమా కథకి ప్రధానమైన ముడిసరుకు అని తెలుస్తోంది. ఇంట్రవెల్ ట్విస్టు బాషాని పోలి ఉంటుందని, ప్రస్థానంలో సాయికుమార్ పాత్రలా.. ఇందులో మోహన్‌లాల్ క్యారెక్టరైజేషన్ ఉంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే కొరటాల శివపై సినీ జనాలకు నమ్మకం బాగా పెరిగిపోతోంది. మిర్చి సినిమా చూసినా ఆరేడు పాత సినిమాల కథలు గుర్తొస్తాయి. శ్రీమంతుడులో దత్తత అన్న పాయింట్ పక్కన పెడితే… అదీ మామూలు కథే. కానీ కొరటాల ట్రీట్ మెంట్, హీరో పాత్రని ఎలివేట్ చేసే విధానం, ఆ ఎమోషన్స్ ఇవన్నీ బాగా కుదిరాయి. ఇక్కడా ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యే ఛాన్సులున్నాయి. అయినా ఈ రోజుల్లో మరీ కొత్త కథలెవ్వరూ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. థియేటర్లో ఉన్నంత సేపూ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలిగితే చాలు. అదెలాగో కొరటాలకు తెలుసు. అందుకే కంగారు పడాల్సిన అవసరమే లేదు. పాత కథని కొరటాల చేసిన రిపేర్లు ఎలాంటి ఫలితం ఇచ్చాయో… ఆగస్టు 12 వరకూ ఆగితే సరిపోతుంది. ఎందుకంటే జనతా గ్యారేజ్ వచ్చేది అప్పుడేగా.