ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రాణం! నిర్మాత సేఫ్‌గా బయటపడాలంటే.. సినిమాని ముందస్తుగా అమ్ముకోవడం కంటే ఉత్తమమైన మార్గం ఉండదు. అలా సినిమా విడుదలకు ముందే మంచి బిజినెస్ చేసుకోవాలంటే కాంబినేషన్ లో స్ట్రెంత్ ఉండాలి. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబో బయ్యర్లకు, డిస్టిబ్యూటర్లకు ఆ నమ్మకాన్ని నలిగించింది. దాంతో… జనతా గ్యారేజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని దిగ్విజయంగా జరుపుకొంది. ఈ సినిమా అన్ని ఏరియాలు కలిపి రూ.60 కోట్ల వరకూ బిజినెస్ జరిగిందని టాక్. దిల్‌రాజు ఎప్పుడైతే నైజాంని రూ.15 కోట్లకు కైవసం చేసుకొన్నాడో… మిగిలిన ఏరియాలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఓవర్సీస్ రూ.7.3 కోట్ల వరకూ పలికినట్టు టాక్. కర్నాటకకు అత్యధికంగా రూ.7 కోట్లు వచ్చాయి. ఎన్టీఆర్ కెరీర్లో ఇదే హయ్యస్ట్ అనిచెప్పొచ్చు. మోహన్ లాల్ ఎఫెక్ట్ అక్కడ బాగా పనిచేసింది. తమిళ నాట కూడా మంచి ధరే పలికిందీ సినిమా. మొత్తానికి.. అన్ని ఏరియాల ద్వారా రూ.60 కోట్లు వచ్చేశాయి. ఇక శాటిలైట్ బిజినెస్ మిగిలింది. శాటిలైట్ ద్వారా కనీసం రూ.9 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా బడ్జెట్ రూ.45 నుంచి రూ.50 కోట్లు అనుకొంటే.. దాదాపు రూ.20 కోట్ల లాభం చూసే అవకాశం దక్కబోతోందన్నమాట. ఇది నిజంగా మైత్రీ మూవీస్‌కి అదిరిపోయే న్యూసే.