కొందరికి కొన్ని భయాలుంటాయి. ఒకరికి నీళ్లంటే భయం. ఇంకొకరికి గాలంటే భయం. కొంతమందికి ప్రయాణాలంటే భయం. సినిమా వాళ్లలో చాలామందికి విమాన ప్రయాణాలంటే చచ్చేంత భయం. కానీ.. అత్యవసర పరిస్థితుల్లో, అతి తొందరగా వెళ్లాల్సివస్తే అంతకు మించిన మార్గం ఉండదు. పైగా సమయం కలిసి వస్తుంది. సినిమా వాళ్లకు సమయం అంటే – బంగారంతో సమానం. అందుకే విమాన ప్రయాణాలు చేయాల్సివస్తుంటుంది. ఈ ప్రయాణాల మీద ఎన్నో ఛలోక్తులు. అందులో ఇదొకటి.
జంథ్యాల, వేటూరి.. ఇద్దరికీ విమాన ప్రయాణాలంటే కాస్త భయం, ఇంకాస్త బెంగ. ఇద్దరూ ఓసారి మద్రాసు నుంచి తిరువనంతపురం వెళ్లాల్సివచ్చింది. ఇద్దరూ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అంతలో ఓ ప్రకటన వినిపించింది. ‘సాంకేతిక కారణాల వల్ల విమానం ఓ గంట ఆలస్యంగా వస్తుంది” అని. దానికి తోడు.. వాతావరణం ఏమాత్రం బాలేదు. అటు వాతావరణం, ఇటు సాంకేతిక లోపం.. రెండూ ఇద్దరినీ తెగ భయపెట్టేస్తున్నాయి. అయినా సరే.. పైకి గంభీరంగా నటించడం మొదలెట్టారు.
ఇంతలో ఇద్దరికీ ఓ బోర్డు కనిపించింది. విమాన ప్రయాణాల ఇన్సురెన్సుకి సంబంధించిన బోర్డు అది.
ఒకరికి తెలియకుండా ఒకరు… ఇన్సురెన్సు చేయించుకోవాలని ఫిక్సయ్యారు. అయితే జంథ్యాల మాత్రం ”ఇదేదో మనకు అవసరం పడేట్టే ఉందే..” అని మనసులోని మాట పైకి అనేశారు.
”చేయిస్తే పోలా…” అంటూ వేటూరి సిద్ధమయ్యారు.
”పోతామంటారా..” అని జంథ్యాల సందేహ పడ్డారు.
”విమానం అనుమానంలో పడింది కదా.. ” అన్నారు వేటూరి గుంభనంగా.
”అది అనుమానంలో పడినా, బంగాళా ఖాతం లో పడినా మనం మాత్రం సేఫ్‌గానే ఉంటాం లెండి” అన్నారు జంథ్యాల.
”అంత నమ్మకం ఏమిటి” అని వేటూరి అడిగితే.. ”అది మనమీదో, విమానం మీదో, పైలెట్ మీదో నమ్మకంతో కాదు.. మన ఇంట్లో వాళ్ల గీతలపై ఉన్న నమ్మకం” అంటూ ఇన్సురెన్సు చేయించకుండానే ఇద్దరూ విమానం ఎక్కేశారు.
అప్పటి నుంచి అటు జంథ్యాల, ఇటు వేటూరి ఇద్దరూ విమాన ప్రయాణం చేసినప్పుడల్లా…ఇదే విషయాన్ని గుర్తు చేసుకుని మరీ నవ్వుకునేవార్ట. వేటూరి తన ‘కొమ్మకొమ్మకో సన్నాయి’ పుస్తకంలో ఈ తమాషా విషయాన్ని రాసుకున్నారు.