సుకుమార్ సినిమా అనగానే లాజిక్కులతో పాటు, ఆయన ఐటెమ్ సాంగులతో చేసే మ్యాజిక్కులు, మ్యూజిక్కులు గుర్తొస్తాయి. సుకుమార్ సినిమాల్లోని ఐటెమ్ సాంగులన్నీ హిట్టే. అవన్నీ ఓ ట్రెండ్ సృష్టించాయి. ‘పుష్ష’లోని ‘ఊ అంటావా..’ పాటైతే… దుమ్ము రేపేసింది. ‘పుష్ష 2’ నుంచి కూడా అలాంటి పాటే ఎదురు చూస్తున్నారు అభిమానులు. దేవిశ్రీ ప్రసాద్ కు కూడా ఐటెమ్ పాటపై ఎలాంటి అంచనాలు ఉంటాయో బాగా తెలుసు. దానికి తగ్గట్టుగానే ఓ మాంఛి ఐటెమ్ గీతాన్ని కంపోజ్ చేశారు. కానీ ఇప్పటి వరకూ ఈ పాటని తెరకెక్కించలేదు. దానికి కారణం ఐటెమ్ పాటలో ఎవరు కనిపిస్తారన్న విషయంలో ఓ స్పష్టత రాకపోవడమే.
‘పుష్ష’ కోసం సమంతని తీసుకొచ్చి… ప్రేక్షకుల్ని సర్ప్రైజ్లో పడేశాడు సుకుమార్. ఎందుకంటే అప్పటి వరకూ సమంత తన కెరీర్లో ఐటెమ్ గీతమే చేయలేదు. కాబట్టి సమంత ఎంట్రీ కొత్తగా అనిపించింది. ‘పుష్ష 2’ కోసం కూడా అలాంటి ఎత్తుగడే వేద్దామనుకొన్నాడు. ఇప్పటి వరకూ ఐటెమ్ ఛాయలే తగలని ఓ కథానాయికని రంగంలోకి దించేద్దామనుకొన్నాడు. కానీ అలాంటి హీరోయిన్ ని ఇప్పటి వరకూ పట్టలేకపోయాడు. శ్రీలీల పేరు మొదట్లో ప్రస్తావనకు వచ్చినా, ఆ తరవాత ఆమె ఫామ్ కోల్పోవడంతో సుకుమార్ ఆ ప్రతిపాదన పక్కన పెట్టేశాడు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రిని ఎంచుకోవాలనుకొన్నారు. తెలుగు తెరకు త్రిప్తి కొత్తగానే ఉంటుంది. కాకపోతే తనకు డాన్స్ పెద్దగా రాదని భావించడంతో ఆమెను పక్కన పెట్టారు. ఆ తరవాత జాన్వీకపూర్ ఎంపిక దాదాపు ఖాయం అన్నారు. జాన్వీ కూడా ఈ పాట చేయడానికి రెడీనే. కాకపోతే రూ.4 కోట్ల పారితోషికం అడిగిందని టాక్. ‘పుష్ష’ కోసం సమంతకే ఆ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు జాన్వీకి ఎందుకు ఇస్తారు? పైగా జాన్వీ డెబ్యూ ‘దేవర’తో జరుగుతోంది. ఆ సినిమా విడుదలయ్యాకే `పుష్ష 2` వస్తుంది. ఒకవేళ `దేవర`లో జాన్వీ పాత్ర అంతగా పండకపోతే.. అప్పుడు ‘పుష్ష 2’లో ఐటెమ్ సాంగ్ చేసినా అంత కిక్ ఉండదు. ‘పుష్ష 2’లో ఐటెమ్ పాట ఎవరు చేసినా.. అది తప్పకుండా ఇన్స్టెంట్ హిట్ అవుతుందని చిత్రబృందం నమ్ముతోంది. అందుకోసం రూ.4 కోట్లు పారితోషికం ఇవ్వాలా? అనేదే డిస్కర్షన్ పాయింట్. మామూలుగా అయితే సుకుమార్ కానీ, మైత్రీ మూవీస్ కానీ ఖర్చు కోసం పెద్దగా ఆలోచించరు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ సినిమా వాయిదా పడడం వల్ల నిర్మాతలపై దాదాపుగా రూ.40 కోట్ల అదనపు భారం పడుతోంది. మరో రూ.4 కోట్లు భరించాలంటేనే లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే జాన్వీ ఎంపికపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.