జాతీయ అవార్డు తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన జానీ మాస్టర్ కు షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన బెస్ట్ కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డును నిలిపివేస్తూ అవార్డు కమిటీ శనివారం రాత్రి నిర్ణయాన్ని ప్రకటించింది. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో ఆయనకు అవార్డు ప్రదానం చేయడం తప్పుడు సంకేతాలు పంపుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
2022 ఏడాదికి గానూ జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును జానీ మాస్టర్ కు ప్రకటించారు. ఈ అవార్డు ప్రధానోత్సవానికి ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కానీ అరెస్టయ్యారు. ఫంక్షన్ కు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కూడా పొందారు. 6 నుంచి 9 వరకు జానీ మాస్టర్ కు బెయిల్ లభించింది. అయితే ఇప్పుడు అవార్డు రద్దు కావడంతో ఆయన బెయిల్ పై బయటకు రావడం కష్టమే. జానీ మాస్టర్‌పై సెప్టెంబర్ 16న ఫిర్యాదు నార్సింగి పోలీసు స్టేషన్లో జానీ మాస్టర్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. టాలీవుడ్ లోనూ తెలుగు టీవీ అండ్ సినిమా డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి నుంచి జానీ మాస్టర్ ను తాత్కాలికంగా తొలగించారు.
ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రకరకాల ఆడియో టేపులు వెలుగులోకి వస్తున్నాయి. మూడు రోజుల పాటు జానీ మాస్టర్ ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. నేరం అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో ఉందని కొన్ని మీడియాలు ప్రచారం చేశాయి. అటూ ఇటూ తిరిగి జానీ మాస్టర్ తన పనికి లభించిన గుర్తింపును కూడా పోగొట్టుకోవాల్సి వస్తోంది.