కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ఎంత తెలుసో… పవన్ కల్యాణ్ భక్తుడిగానూ అంతే తెలుసు. జనసేన కోసం ప్రచారం చేసిన వాళ్లలో జానీ మాస్టర్ ఒకరు. ఓ దశలో జానీకి అసెంబ్లీ టికెట్ దొరుకుతుందని ప్రచారం జరిగింది. కానీ అది మిస్సయ్యింది. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ పేరు బయటకు వచ్చినప్పుడు.. పార్టీ కార్యకలాపాల నుంచి జానీ మాస్టర్ని దూరం పెట్టింది జనసేన. ఆ తరవాత పవన్ కానీ, పార్టీ వాళ్లు కానీ జానీ మాస్టర్ గురించి మాట్లాడింది లేదు. జైలు నుంచి విడుదల అయ్యాక పవన్‌ని కూడా కలుసుకోలేకపోయాడు. ఇవన్నీ చూశాక జనసేనకు జానీ మాస్టర్ దూరం అవుతాడేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ పరిణామాల తరవాత కూడా పవన్ కల్యాణ్‌పై జానీకి ఉన్న ప్రేమ కాస్తంత కూడా తగ్గలేదు.
”ఈ కేసు విషయం బయటకు వచ్చాక పార్టీ కార్యకలాపాలకు నన్ను దూరం పెడుతూ ఓ లేఖ విడుదల చేశారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ముమ్మాటికీ సరైనదే. అలా చేయకపోతే.. ప్రతిపక్షాలకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. జనం చిలవలు పలవలుగా మాట్లాడతారు. పవన్ స్థానంలో నేనున్నా… ఇలాంటి నిర్ణయమే తీసుకొనేవాడ్ని. క్లీన్ చిట్ తో బయటకు వచ్చాక నేను మళ్లీ జనసేన కండువా కప్పుకొంటా. నాపై ప్రజలకు ఎలాంటి నమ్మకం, సానుభూతి ఉన్నాయో పవన్ కల్యాణ్ గారికీ అంతే వుంది. నా నిజాయితీ నిరూపించుకోవడం నా చేతుల్లోనే వుంది” అని చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్. నిజానికి ఇది చాలా మెచ్యూరిటీతో కూడిన స్టేట్ మెంట్. ఇలాంటి ఆరోపణలు రాగానే పార్టీ నాయకుల్ని దూరం పెడుతుంది. అలాంటప్పుడు అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని, పార్టీ నుంచి బయటకు వచ్చేస్తుంటారు కొంతమంది. కానీ ఇప్పటికీ జానీ మాస్టర్ జనసేనను అట్టిపెట్టుకొనే ఉన్నాడు. ఇక నిజాయతీ నిరూపించుకోవడమే మిగిలివుంది.