తెలుగు చిత్రసీమలో పవన్ కల్యాణ్ కు ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యువ హీరోల్లో ఆయన అభిమానులు ఎక్కువ. హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు వీలున్నప్పుడుల్లా పవన్ జపం చేస్తుంటారు. తమ సొంత సినిమాల పబ్లిసిటీ కోసం పవన్ నో, పవన్ పేరునో వాడుకొంటుంటారు. వైకాపా లీడర్లలోనూ చాలామంది పవన్ ఫ్యాన్సే. కానీ బయటకు చెప్పుకోరంతే. కానీ విచిత్రం ఏమిటంటే.. పవన్ ని పొలిటికల్ గా సపోర్ట్ చేయడానికి ఎవరూ ధైర్యం చేయట్లేదు. మనసులో పవన్ పై ప్రేమ ఉన్నా, బయటకు ఎవరూ చెప్పుకోరు. అలాంటిది మైకు పట్టుకొని, పవన్‌కి ఓటేయమని ఎలా అంటారు? పవన్‌పై ప్రేమ ఉంటే, అది మనసులో పెట్టుకొని, ఎన్నికల వేళ చూస్తారంతే. ఓపెన్ అయిపోరు.
కానీ జానీ మాస్టర్ తీరు వేరు. ఆయన పవన్‌కు వీరాభిమాని. మాటల్లో చెప్పుకోవడం కాదు, చేతల్లోనూ అది చూపిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే, ఆయన జనసేన జెండా పట్టుకొన్నారు. వైకాపా నాయకుల మీద.. తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. జానీకి జనసేన సీట్ ఆఫర్ చేస్తుందని అంతా అనుకొన్నారు. కానీ పొత్తుల వల్ల అది కుదర్లేదు. జనసేన 24 సీట్లకు పరిమితం అయిపోవడంతో జానీకి అవకాశం దక్కలేదు. అలాగని జానీ అలగలేదు. పవన్ పై, జనసేనపై మరింత ప్రేమ చూపించారు. ఇప్పుడు జనసేనకు సపోర్ట్ గా ఓ పాట వదిలారు. ఆ పాటకు కొరియోగ్రఫీ చేయడమే కాదు, అందులో జెండా పట్టుకొని, పదానికి పాదం కలిపి ఉత్సాహం తీసుకొచ్చారు. జనసేనపై వచ్చిన పాటల్లో ఇన్స్టెంట్ గా హిట్టయిపోయింది ఈ పాట. ఈ పాటకైన ఖర్చు మొత్తం జానీ మాస్టరే స్వయంగా భరించడం విశేషం. పవన్ గెలుస్తాడా, లేదా? గెలిస్తే మనకేం ఒరుగుతుంది? సీటు రాలేదు కదా? మనం పార్టీకి ఎందుకు పని చేయాలి? ఇలాంటి ఈక్వేషన్స్ ఏమీ లేకుండా, నిజమైన జనసైనికుడిలా పనిచేసి, పవన్ పై తనకున్న ప్రేమ మరోసారి ఘనంగా చాటుకొన్న జానీ మాస్టర్ ని అభినందించాల్సిందే.