వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ చేసిన ప్రసంగంలో, మేనిఫెస్టోలో తాను ఇచ్చిన హామీలన్నింటిని ఖచ్చితంగా అమలు చేస్తానని ప్రకటించారు. అయితే ఈ సందర్భంలో మాట్లాడుతూ, ఆగస్టు 15వ తేదీ వచ్చేసరికి గ్రామ యువతకు ఉద్యోగాలు ఇస్తామని, గ్రామ వాలంటీర్లను నియమిస్తామని ప్రకటించారు. వీరికి ప్రభుత్వం తరపున జీతభత్యాలు చెల్లిస్తామని కూడా చెప్పారు.
దాదాపు 4 లక్షల ఉద్యోగాలు- ఈ విధంగా గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయం లో ఉద్యోగాల తో భర్తీ చేస్తామని ప్రకటించారు. ఒక్కొక్క గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్లను ప్రభుత్వం నియమిస్తుందని, వీరు ప్రభుత్వ పథకాలను ఆ 50 ఇళ్లలో వారికి ఎవరికైనా అవసరం ఉంటే డోర్ డెలివరీ చేస్తారని వివరించారు. అలా చేసినందుకు గాను ఈ వాలంటీర్లకు నెలకు ఐదు వేల రూపాయల జీతం ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారు. ఈ లెక్కన, నాలుగు లక్షల మందికి ఐదు వేలు జీతం చొప్పున దాదాపు ప్రతి నెల రెండు వందల కోట్లు వీరి జీతభత్యాల కోసం ప్రభుత్వం చెల్లిస్తుంది అన్న మాట. మొత్తానికి ఏటా 2400 కోట్ల రూపాయలు గ్రామ వాలంటీర్ల జీతాల కోసం ప్రభుత్వం చెల్లిస్తుంది.
అయితే, ఈ గ్రామ వలంటీర్ల పథకం మొన్న చంద్రబాబు హయాంలోని జన్మభూమి కమిటీల కి ఏ విధంగా భిన్నం గా ఉంటుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. జన్మభూమి కమిటీల పేరిట జరిగిన అరాచకాలు ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గ్రామ వలంటీర్ల పథకం కూడా పేరు మార్చిన జన్మభూమి కమిటీల మాదిరిగానే కనిపిస్తోంది. పైగా ఈ సారి ప్రభుత్వం అధికారికంగా వీరికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు జీతం చెల్లిస్తుంది. అయితే కొంత మంది విశ్లేషకులు మాత్రం, గ్రామ వలంటీర్ల పథకం కారణంగా వైఎస్ఆర్సీపీకి క్యాడర్ మరింతగా బలోపేతం కావడం ఖాయం అని విశ్లేషిస్తున్నారు. ఈ 4 లక్ష ఉద్యోగాల లో దాదాపు 90 శాతం వరకు వైస్సార్సీపీ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించిన వారికి దక్కే అవకాశం ఉండడంతో, పార్టీ క్యాడర్ చెక్కుచెదరకుండా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనికి టాక్స్ పేయర్ చెల్లించిన డబ్బును వినియోగించడాన్ని ప్రజలు ఏ విధంగా ఆహ్వానిస్తారో అన్నది వేచి చూడాల్సి ఉంది.