జన్మభూమి కమిటీలను రద్దుచేయడమే బెటరా? అని తెలుగుదేశం అధ్యక్షుడైన రాష్ట్రమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. విజయవాడలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానం చేశారని తెలిసింది.
అన్ని ప్రభుత్వ పధకాలకూ లబ్దిదారులను ఎంపిక చేసే బాధ్యతలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. అంకితమైన తెలుగుదేశం కార్యకర్తలను ఈ కమిటీల్లో నియమించడంద్వారా నిజమైన పేదలను గుర్తించవచ్చని, వారందరి మద్దతు తెలుగుదేశం పార్టీకే వుంటుందని ఆలోచనతో కమిటీలను నియమించారు. అయితే, పదేళ్ళపాటు అధికారానికి దూరంగా వుండి, చిల్లర ఖర్చులకు కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్న వారూ, గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధులకు ఆర్ధికంగా, ఇతరత్రా సహాయం చేసిన వారి అనుచరులు జన్మభూమి కమిటీల్లో చొరబడిపోయారు. మిత్రపక్షమైన తమ పార్టీకి కమిటీలో ఏ చోటూ ఇవ్వలేదని బిజెపి మండిపడుతోంది కూడా.
ప్రజలకీ, పార్టీకీ కూడా ప్రయోజనం తెచ్చిపెట్టవలసిన జన్మభూమి కమిటీలు ఆశ్రితుల నిలయాలుగా, అవినీతి పరుల ఆశ్రయాలుగా మారిపోవడం ప్రభుత్వానికి, పాలకపార్టీకీ కూడా అప్రతిష్టను పెంచేస్తోంది.
మహిళా సంఘాలకు ఇచ్చిన ఇసుక రేవులు ఎమ్మెల్యేల అండదండలతో ఎలా మాఫియాలుగా మారిపోతున్నాయో జన్మభూమి కమిటీలు కూడా అలాగే మారిపోతున్నాయి. ఇసుకను ఉచితం చేసి నిర్మాణ రంగాన్ని మాఫియా నుంచి విముక్తి చేయాలనుకున్నట్టే, జన్మభూమి కమిటీలను కూడా రద్దు చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా అర్ధమౌతోంది.
కమిటీలపై జిల్లాలనుంచి వరదలా వచ్చిపడుతున్న ఫిర్యాదులు, అక్కడక్కడా వున్న కోర్టు లిటిగేషన్ల నేపధ్యంలో ఈ”రద్దు”ఆలోచన మొదలైనట్టు అర్ధమౌతోంది.
టీడీపీ జిల్లా ఇంఛార్జ్ ల పనితీరుపై కూడా చంద్రబాబు మండిపడ్డారు. జిల్లా ఇంఛార్జ్ లు బాధ్యతలు తీసుకోవడంలేదని.. మొక్కుబడిగా వ్యవహరించవద్దని నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ప్రతి కేబినెట్ సమావేశం తర్వాత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంఛార్జ్‌లకు బాధ్యతలు అప్పగించడం వల్ల పథకాలు లబ్దిదారులకు అందుతాయని మంత్రులు చంద్రబాబుకు సూచించారు.