అన్ని మతాలు ఒకటే అన్న సామరస్యభావం నాయకుల్లో ఉందోలేదోకానీ, ప్రజల్లోమాత్రం నిండుగా ఉన్నదనడానికి ఓ చక్కటి తార్కాణంఇది. ముస్లీం ఇంట ఇప్పటికి 29 సంవత్సరాలుగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మతసామరస్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన సంఘటన ఇది.
కాన్పూర్ లోని బర్రా విశ్వాబ్యాంక్ కాలనీలో అహ్మద్ అనే ముస్లీంసోదరుడి ఇంట ప్రతిఏటా కృష్ణాష్టమి వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా జరుగుతూనేఉన్నాయి. అహ్మద్ అతనిభార్య, ముగ్గురు పిల్లలు తమ ఇంటజరిగే వేడుకల్లో మనస్ఫూర్తిగా ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొనడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. శ్రీకృష్ణుడి జన్మదినమైన అష్టమిరోజున కృష్ణుడిలీలలకు సంబంధించిన బొమ్మలను, చిత్రపటాలను ఇంట్లో ఉంచుతారు. బొమ్మలతో సెట్టింగ్స్ వేస్తారు. చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని ఊయలలోఉంచి లాలిపాటలు పాడుతుంటారు. కొత్తగా ఎవరైనా కృష్ణాష్టమిరోజున వాళ్ల ఇంటికివెళ్ళిచూస్తే, ఇవ్వాళే కృష్ణుడు పుట్టాడేమో అన్నట్టుగా ఉంటుంది అక్కడి వాతావరణం. పాలు, వెన్నలు నైవేధ్యంగా పెట్టడం, భక్తిపాటలు పాడటం, ఒకరినొకరు బహమతులను పంచుకోవడం వంటి వేడుకలతో ఆ ఇళ్లు బృందావనంలా మారిపోతుంది.
`కృష్ణభగవాన్అంటే మా ఇంట్లోని అందరికీ సంపూర్ణ విశ్వాసం. అందుకే కృష్ణాష్టమిని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటాము. ఇరుగుపొరుగువారి ప్రోత్సాహం మాకు కొండంత అండ’ అని ఎంతో వినయంగా చెబుతుంటారు అహ్మద్.
హిందువుల పండుగను ముస్లీంలు ఆచరిస్తున్నట్టుగానే, ముస్లీంల వేడుకల్లో హిందువులు పాల్గొనడం, వారి పండుగులను ప్రోత్సహించడం చాలాచోట్లే జరుగుతుంటుంది. ప్రజల్లో మతసామరస్యం నిండుగానే ఉన్నా, కొంతమంది నాయకులు తమ స్వార్థప్రయోజనాలకోసం చేసే వ్యాఖ్యలవల్ల దేశంలో మతపరమైన హింస చెలరేగుతున్నదని అహ్మద్ ఆవేదన వ్యక్తంచేశారు. అనేక చోట్ల దర్గాలకు హిందువులువెళ్ళి ప్రార్థనలు చేయడం తెలిసిందేననీ, అలాగే, తమ ఇంట చిన్నికృష్ణుడి చిత్రపటాలు, బొమ్మలతో 29ఏళ్లుగా కృష్ణాష్టమి వేడుకలు నిండుమనసుతో జరుపుకుంటున్నామని అహ్మద్ కుటుంబసభ్యులంటున్నారు.
మతసామరస్యమన్నది మాటల్లోకాకుండా ఇలా ఆచరణలో చూపించే వ్యక్తులను ప్రోత్సహించాలని, మానవత్వం ఇనుమడింపజేస్తూ, ప్రేమానురాగాలు పెంపొదించడానికి ఇలాంటివి దోహదపడతాయని ఇరుగుపొరుగునున్న హిందువులు అంటున్నారు. భిన్నమతాలు, విభిన్న సంస్కృతల మేలిమి సమ్మేళనంలా ఆ ప్రాంతం శోభిస్తోంది.
– కణ్వస