ఎన్నో ఆశలతో 2019లోకి అడుగుపెట్టింది టాలీవుడ్. గతేడాది ఇచ్చిన చేదు జ్ఞాపకాల్ని మర్చిపోతూ.. విజయాల్ని స్ఫూర్తిగా తీసుకుంటూ 2019ని ఘనంగా ప్రారంభిద్దాం అనుకుంది. కానీ వరుస పరాజయాలు టాలీవుడ్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈనెలలో 5 చిత్రాలు విడుదలైతే.. అందులో ఒకే ఒక్క సినిమా నిర్మాతలకూ, పంపిణీదారులకూ లాభాల్నిపంచింది.
శుభారంభం – సగం విజయం అంటారు పెద్దలు. ఆరంభం అదిరితే… ఆ ప్రయాణం సుఖవంతంగా, ఫలప్రదంగా ఉంటుంది. కానీ… అలాంటి ఆరంభం టాలీవుడ్ కి లభించలేదు. సంక్రాంతి సీజన్లో వచ్చిన నాలుగు చిత్రాల్లో ఒకటి మినహా మిగిలినవన్నీ నిరాశాజనకమైన ఫలితాల్ని సాధించాయి. జనవరి 9న ‘కథానాయకుడు’ విడుదలైంది. ఎన్టీఆర్ బయోపిక్ ఇది. క్రిష్ దర్శకత్వం వహించారు. తండ్రి పాత్రలో బాలకృష్ణ కనిపించడం, టాలీవుడ్‌లోని టాప్ స్టార్లలో కొంతమంది వివిధ పాత్రలలో దర్శనమివ్వడం, ఈ చిత్రానికి బాలయ్యే నిర్మాత కావడం.. ఇవన్నీ బయోపిక్‌పై అంచనాలు పెంచాయి. కానీ వాటిని ‘కథానాయకుడు’ ఏమాత్రం అందుకోలేకపోయింది. బాలయ్య నటన, మేకింగ్, క్రిష్ దర్శకత్వ ప్రతిభ.. వీటిపై ఎలాంటి నెగిటీవ్ కామెంట్లూ రాలేదు. రివ్యూలు సైతం బాగానే అనిపించాయి. కానీ… అవేం బాక్సాఫీసు దగ్గర వసూళ్లని పెంచడంలో దోహదం చేయలేకపోయాయి. 2019లో తొలి డిజాస్టర్‌గా `కథానాయకుడు` మిగిలిపోయింది.
ఆ మరుసటి రోజు ‘పేటా’ విడుదలైంది. రజనీ సినమా విడుదల సమయంలో ఉండే హడావుడి ‘పేటా’ విషయంలో కనిపించలేదు. తగిన థియేటర్లు లభించకపోవడం, పబ్లిసిటీ పరంగా జాగ్రత్తలు తీసుకోకపోవడం `పేటా`ని ఇబ్బంది పెట్టాయి. రివ్యూలు ‘జస్ట్ ఓకే’ సినిమాగా ముద్ర వేశాయి. ఆ మేరకు కాస్తో కూస్తో వసూళ్లని రాబట్టగలిగింది ‘పేటా’. జనవరి 11న విడుదలైన ‘వినయ విధేయ రామ’ అటు బోయపాటి కెరీర్లోనూ, ఇటు చరణ్ కెరీర్లోనూ పరాజయంగా మిగిలిపోయింది. యాక్షన్‌కి పెద్ద పీట వేసిన ఈ సినిమాలో.. ఆ ఎపిసోడ్లే కామెడీగా మారిపోయాయి. హీరో ఎలివేషన్‌పై పెట్టిన శ్రద్ధ… కథపై పెట్టకపోవడంతో వినయ విధేయ రాముడు పట్టు తప్పాడు. వెరసి సంక్రాంతికి మరో ఫ్లాప్ మిగిల్చింది.
ఈ పరాజయాల లెక్కల్ని చెరిపివేసేందుకు ‘ఎఫ్ 2’ రంగంలోకి దిగింది. సంక్రాంతి సీజన్ చివర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మెరుపులాంటి విజయాన్ని అందుకుంది. వెంకీ, వరుణ్‌లు చేసిన అల్లరి ప్రేక్షకులకు నచ్చేయడంతో ఈ సంక్రాంతి విజేతగా నిలిచింది. మిగిలిన సినిమాలు చూసి విసుగు చెందిన తెలుగు ప్రేక్షకులు… ఏకగ్రీవంగా ‘ఎఫ్ 2’కి పట్టం కట్టడంతో దాదాపు 70 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యంలో పడేసింది.
సంక్రాంతి సినిమాల ధాటికి ఓ వారం బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమాలేం రాలేదు. డ్రై ఫ్రైడేగా గడిచిపోయింది. ఈవారం మాత్రం ఒకే ఒక్క సినిమా విడుదలైంది. అదే… ‘మిస్టర్ మజ్ను’. ఈ సినిమాపై కూడా అన్నో ఇన్నో ఆశలుండేవి. తొలిప్రేమతో హిట్టు కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో.. కాస్త హైప్ వచ్చింది. కానీ.. తొలి షోకే `మజ్ను` తేలిపోయాడు. అటు వసూళ్లు, ఇటు రివ్యూలు రెండూ డల్‌గా సాగాయి. దాంతో.. అఖిల్‌కి హ్యాట్రిక్ పరాజయాల భారం మోయక తప్పలేదు.
మొత్తానికి జనవరి లో తీపి కంటే చేదే ఎక్కువ చూసింది టాలీవుడ్. ఆమాత్రం దానికే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరిలోనూ మంచి సినిమాలే వస్తున్నాయి. సంక్రాంతిలానే వేసవి సీజన్లోనూ ఎక్కువ సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ లోటు.. రాబోయే సీజన్లు తీర్చాలి.