శుభారంభం సగం విజయం అంటారు. ఏ పనిలో అయినా ప్రారంభం బాగుండాలి. మిగిలిన పని కూడా పూర్తి చేయడానికి కావల్సినంత ఉత్సాహం వస్తుంది. అయితే టాలీవుడ్ కి మాత్రం శుభారంభం దక్కలేదు. 2020. 2021లో టాలీవుడ్ ఎన్నో చేదు అనుభవాలు చవి చూసింది. కరోనా వల్ల.. చిత్రసీమ పూర్తిగా నష్టపోయింది. తిరిగి కోలుకునే అవకాశం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. 2021 డిసెంబరులో కొన్ని మెరుపులాంటి విజయాలు అందాయి. అదే ఉత్సాహంతో 2022 ప్రారంభించింది. అయితే ఫలితాలు ఆశాజనకంగా లేవు.
ఈ యేడాది జనవరిలో ఇప్పటి వరకూ 10 సినిమాలు విడుదలయ్యాయి. ఈ పదింట్లో ఒక్కటే హిట్టు. `బంగార్రాజు` కమర్షియల్ గా హిట్ అయ్యింది గానీ, విమర్శకుల మెచ్చుకోళ్లు అందుకోలేకపోయింది. సంక్రాంతి సీజన్‌కి విడుదల కాకపోయి ఉంటే.. బంగార్రాజు ఫలితం మరోరకంగా ఉండేదన్నది విశ్లేషకుల మాట. ఏది ఏమైనా హిట్టు హిట్టే. జనవరిలో టాలీవుడ్ కి దక్కిన ఏకైక విజయం బంగార్రాజు.
ఈ నెల తొలి వారంలో విడుదలైన ఆశ – ఎన్ కౌంటర్, ఇందువదన, 1945, అతిథి దేవోభవ.. ఇవన్నీ డిజాస్టర్లే. రానా నటించిన 1945 అయితే క్లైమాక్స్కూడా లేకుండానే విడుదల చేశారు. సంక్రాంతికి వచ్చిన రౌడీబోయ్స్, హీరో ఫ్లాపులుగా మిగిలాయి. ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ఆర్భాటంగా ప్రచారం చేసినా కలసి రాలేదు. ఈ నెలాఖరున విడుదలైన `గుడ్ లక్ సఖి` కూడా బ్యాడ్ లక్కే మిగిల్చింది. కీర్తి సురేష్ కెరీర్లో మరో డిజాస్టర్ గా మిగిలింది. కరోనా అలజడి ఉన్నా, 50 % ఆక్యుపెన్సీ నిబంధన ఉన్నా… వసూళ్లు బాగానే ఉన్నాయి అనడానికి `బంగార్రాజు`కి వచ్చిన కలక్షన్లే నిదర్శనం. సంక్రాంతి సీజన్లో పుష్ప, అఖండలు కూడా మంచి వసూళ్లని రాబట్టుకున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలు లేకపోవడం వల్లే.. బాక్సాఫీసు దగ్గర విజయాల కొరత కనిపించింది.
అయితే ఫిబ్రవరి… టాలీవుడ్ లో ఆశలు చిగురింపజేస్తోంది. ఈ నెలలో ఖిలాడీ, శేఖర్, అభిమన్యుడు, ఆడాళ్లూ మీకు జోహార్లు, డీజే టిల్లు.. ఇలాంటి క్రేజీ సినిమాలు విడుదల అవుతున్నాయి. కనీసం డజను సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. చూద్దాం.. ఫిబ్రవరి జాతకం ఎలా ఉంటుందో?