ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించబోయే భవనాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, అత్యంత సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా, పర్యావరణానుకూలంగా, రాష్ట్ర సంస్క్రతిని ప్రతిభింభించేవిగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుకొంటున్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలువగా భారత్ కి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ డీవీ జోషి, బ్రిటన్ కి చెందిన రిచర్డ్ రోజస్, జపాన్ కి చెందిన మాకి అండ్ అసోసియేట్స్ డిజైన్లు సమర్పించాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత అనుకూలంగా ఉన్న డిజైన్ న్ని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వారిలో ముగ్గురు విదేశీయులు ముగ్గురు భారతీయులు సభ్యులుగా ఉన్నారు. వారిలో సుహాజ్ ఓల్టా, ఇర్విన్, క్రిస్టోఫర్ విదేశీ నిపుణులు కాగా రవీంద్ర నాథ్, కేశవా వర్మ, రాజీవ్ సేథిలు భారత్ కి చెందినవారు. వారు జపాన్ సంస్థ రూపొందించిన డిజైన్లను ఖరారు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, సి.ఆర్.డి.ఏ. అధికారులకి కూడా అదే నచ్చడంతో దానినే ఖరారు చేసారు. విజయవాడ గేట్ వే హోటల్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశం తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసారు.