భారత స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది. 2024 – టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత ఆటగాడు బుమ్రా. అంతకు ముందు రాహుల్ ద్రవిడ్ (2004), గంభీర్ (2009), సెహ్వాగ్ (2010), అశ్విన్ (2016), కోహ్లీ (2018) ఈ గౌరవం దక్కించుకొన్నారు. 2024లో బుమ్రా అద్భుతాలు చేశాడు. ముఖ్యంగా ఎర్రబంతితో తన పదునెంతో చూపించాడు. 13 మ్యాచ్‌లలో 71 వికెట్లు తీశాడు. ఒకే యేడాది టెస్ట్ లలో అత్యధిక వికెట్లు తీసిన వీరుడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఘనతే… తనని టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిపింది. ఇటీవల ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లోనూ బుమ్రా చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. సిరీస్ కోల్పోయినా.. బుమ్రా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌తో తన హవా ఎలాంటిదో చూపించుకొన్నాడు. కెరీర్లో 45 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 200 పైచిలుకు వికెట్లు సాధించాడు. 89 వన్డేల్లో 149 వికెట్లు, 70 టీ20ల్లో 89 వికెట్లు దక్కించుకొన్నాడు. దేశంలోనే కాదు, ప్రపంచంలోని మేటి బౌలర్‌గా కితాబులు అందుకొంటున్నాడు.
మరోవైపు వన్డేల్లో అత్యుత్తమ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచింది. ఈ పురస్కారం అందుకోవడం ఆమెకు ఇది రెండోసారి. 2024లో స్మృతి అద్భుతంగా రాణించింది. 13 మ్యాచ్‌లలో 747 పరుగులు చేసింది. ఇందులో 4 సెంచరీలు కూడా ఉన్నాయి. పురుషుల విభాగంలో ఈ పురస్కారం బంగ్లాదేశ్ బ్యాటర్ అజ్మతుల్లా ఎంపికయ్యాడు.