తగలేస్తే సమాజాన్ని దిగొస్తాయి సర్కారులు
నవ్యపథం చూపించిన జాట్ లందరికీ జయహో
ఆసేతు హిమాచలమూ.. అనేకమౌ జనరణాలు
హింస వినా దారి లేదను నవ గాంధీలకు జయహో
అహింసాత్మక ధర్నాలంటే నేడది పాత చింత పచ్చడే
ఇన్స్టంట్ రిజల్ట్ వాదులకు రోత పుట్టిస్తే జయహో
తలచినదెల్లా అడగడం, కాదంటే తన్ని తగలేయడం
అగ్గిపుల్ల సిద్ధాంతం.. పరిఢవిల్లుతోంది జయహో
జాట్లకు రిజర్వేషన్ అవసరమా? లేదా? జాట్ల డిమాండకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి రిజర్వేషన్ సదుపాయం కల్పించడానికి, దానికి అనుకూలంగా తదుపరి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతామని హామీఇవ్వడం జరిగిపోయింది. జాట్లు రిజర్వేషన్ సాధించుకోవడం న్యాయాన్యాయాల గురించిన సమీక్ష పక్కన పెడితే.. వారు తమ డిమాండును సాధించుకున్న తీరు, అందుకు అనుసరించిన మార్గాలు మిగిలిన దేశానికి భయం పుట్టిస్తున్నాయి.
ఈ దేశంలో చాలా ప్రాంతాల్లో కులాలు- రిజర్వేషన్లకు సంబంధించి చాలా డిమాండ్లు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో జాట్ల ఉద్యమం విపరీతమైన హింసను ప్రేరేపించిన నేపథ్యంలో వారికి తక్షణం రిజల్ట్ కనిపించడం అనేది దేశంలో మిగిలిన వారికి కూడా ఎక్కడ ప్రేరణ ఇస్తుందో అనే భయం కలుగుతోంది. అదే జరిగితే గనుక.. మొన్నటి తుని దుర్ఘటనల్ని తలదన్నే స్థాయిలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి డిమాండుతో ఆందోళనలు చేసేవారంతా.. ప్రభుత్వాన్ని సానుకూలంగా కనీసం అడగడానికంటె ముందు హింసాత్మక మార్గంతోనే ప్రారంభించే దుర్దినాలు మొదలవుతాయి. ఈ జాట్లు సాధించిన దాన్ని బట్టి ఆ భయమే ప్రజల్లో కలుగుతోంది.