నవీన్ పొలిశెట్టి.. ఓ హాస్య రత్నం.
`ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ` చూడగానే…. అందరికీ అనిపించింది ఇదే కావొచ్చు.
అన్నం ఉడికిందా, లేదా? అనేది ఒక్క మెతుకు చూసి చెప్పేయొచ్చు. అలాంటి సినిమా… అది. అలాంటి క్యారెక్టర్ అది. ఆ సినిమాతోనే.. నవీన్ పొలిశెట్టి తనదంటూ ఓ ముద్ర వేశాడు. బాలీవుడ్ చిచోరే..లోనూ ఓ కీలక పాత్ర పోషించి, అందరి మనసుల్నీ గెలుచుకున్నాడు. లాక్డౌన్ సమయంలో ఫన్నీ వీడియోలు చేసి, నవ్వించాడు. ఇప్పుడు `జాతిరత్నాలు`గా రాబోతున్నాడు.గురువారం ఈసినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నవీన్ తో చిట్ చాట్.
హాయ్.. ఏజెంట్
– హాయ్ అండీ…
రేపు చాలా సినిమాలున్నాయి. అందులో మీదొకటి. కాంపిటేషన్ ఫీల్ అవుతున్నారు?
– అదేం లేదండీ. మీరు ఏదైనా పెళ్లికి వెళ్లారనుకోండి. అక్కడ బఫేలో ఒకటే ఐటెమ్ ఉండదు కదా. చాలా రకాలు ఉంటాయి. రేపటి బఫేలో.. మాదీ ఒక ఐటెమే. అందరూ అన్ని రకాల ఐటెమ్స్ టేస్ట్ చేసినట్టు.. అందరూ అన్ని సినిమాలూ చూస్తారు. ఏది బాగుందో, ఏది బాలేదో ప్రేక్షకులు చెబుతారు. మిగిలిన అన్ని సినిమాలకూ నా బెస్ట్ విషెష్.
బఫేలో మీరు పెట్టే ఐటెమ్ ఏమిటి?
– మంచి బిరియానీనే.
ఏజెంట్, చిచోరే తరవాత ఇలాంటి సినిమానే చేయాలనుకున్నారా?
– ఏజెంట్, చిచోరే నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. మూడో సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉండాలి అనుకునేవాడ్ని. నాపై నాకే చాలా ప్రెజర్ పెరిగింది. ఓ రోజు నాగ అశ్విన్ ఫోన్ చేశారు. `మంచి కథ ఉంది..విను` అన్నారు. దర్శకుడు ఫుల్ నేరేషన్ చెప్పేసరికి.. ఓకే అనేశా. నేను ఎదురు చూసిన కథ ఇది.
ఎందుకంటే… ఏజెంట్ పాత్ర నన్ను చాలా పాపులర్ ని చేసింది. ఎక్కడికెళ్లినా `ఏజెంట్..` అని పిలవడం మొదలెట్టారు. అందులోంచి బయటకు రావడానికి జాతిరత్నాలు చాలా ఉపయోపడుతుంది. ఇక నుంచి కొంతకాలం..నన్ను జోగిపేట శ్రీకాంత్ అని పిలుస్తారు. ఏజెంట్ కి పూర్తిగా ఆపోజిట్ లో ఉండే పాత్ర ఇది.
ముగ్గురు హీరోలు కనిపిస్తున్నారు కదా..?
– కథే పెద్ద హీరో అండీ. అదే మమ్మల్ని నడిపించింది. కథలో మేమంతా భాగం అంతే.
ఏరకంగా మీ ముగ్గురూ జాతిరత్నాలు అయ్యారు?
– జాతి రత్నాలు.. చాలా సెటైరికల్ గా పెట్టిన టైటిల్. ఫ్రీడమ్ ఫైటర్స్.. సొసైటీకి మంచి పని చేసినవాళ్లని జాతిరత్నాలు అని పిలుస్తారు. మాకు అంత లేదు… కేవలం సెటైరికల్ గా పెట్టా. సెట్లో ఎలా అయిపోయిందంటే… ఓ పనిని ఎవరైనా సరిగా చేయలేకపోయారంటే.. `వచ్చాడ్రా జాతి రత్నం ` అనడం మొదలెట్టాం. మేం ముగ్గురం అదే టైపు.
ఇంతకీ మీ టీమ్ లో నిజమైన జాతి రత్నాలు ఎవరు?
– మా నిర్మాతలు.. నిజమైన జాతి రత్నాలు. ఎందుకంటే ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఏ బ్యాక్ గ్రౌండ్ లోని నా లాంటి హీరోతో సినిమా చేయడం గొప్ప విషయం. ప్రతీ ఇంట్లోనూ ఓ నవీన్ ఉంటాడు. వాడిలో ఏదో ఓ టాలెంట్ ఉంటుంది. అయినా సరే.. ఇంట్లో వాళ్లు `వద్దురా బాబూ.. మనకెందుకు ఇవన్నీ` అంటుంటారు. ఆ చెప్పడం ఆపాలంటే మీ ప్రతిభకు సరైన వేదిక ఉంది అనే ధైర్యం కావాలి. అవి ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ లు కల్పిస్తుంటాయి.
నాగ అశ్విన్ మీకు ముందు నుంచీ తెలుసా?
– మా ఇద్దరికీ చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. తాను.. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచీ నాకు తెలుసు. ఇద్దరం సాధకబాధకాలు పంచుకునేవాళ్లం. నా వీడియోలు చాలా ఇష్టపడేవాడు.
మరి… ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటిలో ఎందుకు ఛాన్స్ రాలేదు?
– అప్పుడు అనుకున్నాం. కానీ కుదర్లేదు. నాతో ఓ ప్రాజెక్టు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు.
ఇన్నాళ్లకు వర్కవుట్ అయ్యింది.
సెట్లో చాలా ఇంప్రూవ్ మెంట్లు చేస్తుంటార్ట. ఇంటి దగ్గర కూడా హోం వర్క్ ఉంటుందా?
– నాకు ఏదైనా సీన్ ఇచ్చి ఇంప్రవైజ్ చేయగలిగే ఫ్రీడమ్ ఇస్తే.. ఇంకా బాగా చేయగలను. ఆ ఫ్రీడమ్ నాకు నా దర్శకులు ఇచ్చారు. కామెడీలో టైమింగ్ ముఖ్యం. ఆ సీన్ లో ఫన్ ఉందా, లేదా? అని జడ్జ్ చేయగలడం చాలా ముఖ్యం. మేమంతా కూర్చుని.. మాట్లాడుకుని.. ఏది సరిగా ఉంటుందో లేదో చూసుకునేవాళ్లం. నాకు ఏదీ కేక్ వాక్ అనిపించదు. చిన్న షాట్ ఉన్నా బాగా ప్రిపేర్ అయే చేస్తా. దర్శకుడు అనుదీప్ చాలా హడావుడి బ్యాచ్. ఓ టేక్ తీసుకుని వెళ్లిపోతాడు. సీన్ అవుతుండగానే కట్ చెప్పేస్తాడు. నేను అలా కాదు. రెండు మూడు ట్రై చేస్తా. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటా.
జాతి రత్నాలంటే అమాయకులా? అంతకు మించి ఉంటారా?
– సినిమా చూస్తే… వీళ్లసలు స్కూలుకి వెళ్లారా? చదువు సంధ్యా వచ్చా అనుకుంటారు. అమాయకులే. కానీ దుర్మార్గులు. వాళ్ల దుర్మార్గం కూడా ఫన్నీగా ఉంటుంది. ఫన్ మాత్రమే కాదు. మంచి లవ్ ట్రాక్ కూడా ఉంఉటంది. చిట్టి – శ్రీకాంత్ లవ్ ట్రాక్ చాలా క్యూట్ గా ఉంటుంది.
ఈ సినిమా కర్నూల్లోని మీ అభిమాని కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు కదా..?
– అవును. ఈ సినిమా చూసిన మొదటి ప్రేక్షకుడు తానే. `అన్నా ఈ సినిమా 10 సార్లు థియేటర్లో చూద్దాం అనుకున్నా. కానీ ప్రమాదంలో కాలుకి గాయమైంది. నడవలేకపోతున్నా` అంటూ ఓ అభిమాని ట్వీట్ చేస్తే. తనకోసం సినిమా ప్రత్యేకంగా చూపించాం. ఈ సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. తన బాధని మర్చిపోయాడు. ఈసినిమా లక్ష్యం కూడా అదే. అందరూ తమ బాధల్ని మర్చిపోవాలి. 2020 సరిగా నడవలేదు. ఆ బాధల్ని ఈసినిమా చూశాక కొంతైనా మర్చిపోతారు. అందుకే ఎన్ని ఓటీటీ ఆఫర్లు వచ్చినా ఈ సినిమాని థియేటర్లోనే రిలీజ్ చేద్దామనుకున్నాం.
చిచోరే తరవాత బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయా?
– వచ్చాయి. అక్కడ ఓ సినిమా మొదలెట్టాం. షూటింగ్ మధ్యలో ఆగింది. లాక్ డౌన్ వల్ల… ఇబ్బందులు వచ్చాయి. త్వరలోనే ఆ షూటింగ్ పూర్తి చేస్తాం. జాతి రత్నాలు కూడా హిందీ లో డబ్ చేసి విడుదల చేద్దామనుకుంటున్నాం.