2021లో వచ్చిన అతి పెద్ద హిట్స్‌లో జాతిరత్నాలు ఒకటి. కేవలం 4 కోట్లతో తయారైన ఈ సినిమా ఏకంగా 40 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా దర్శకుడు అనుదీప్ అందరి దృష్టిలో పడిపోయాడు. రెండో సినిమా కూడా వైజయంతీ మూవీస్ లోనే చేయబోతున్నాడు. హీరోగా రామ్ పేరు బయటకు వచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ లేదు.
కాకపోతే.. అనుదీప్ దగ్గర 3 కథలు రెడీగా ఉన్నాయి. అందులో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే కథ ఒకటుంది. మార్షల్ ఆర్ట్స్ అనగానే భారీ రేంజు యాక్షన్ మూవీ అనుకోవాల్సిన అవసరం లేదు. `జాతిరత్నాలు` టైపులోనే ఫుల్ లెంగ్త్ కామెడీ కథ ఇది. జాకీచాన్ సినిమాలు చూసి, మార్షల్ ఆర్ట్స్ నేర్చేసుకుందామని, రెండ్రోజులు కుస్తీలు పట్టి – ఆ తరవాత కామ్ అయిపోయే బ్యాచ్‌లు చాలా ఉన్నాయి. వాళ్ల గురించి సాగే కథ ఇదని సమాచారం. నవీన్ పొలిశెట్టికి మరో కథ వినిపించాడట. అదీ కాక.. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా ఉందని తెలుస్తోంది. మరి ఈ మూడు కథల్లో ఏది ముందు పట్టాలెక్కుతుందో చూడాలి.