ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ కన్నా ఎక్కువ అధికారులు ఉండేది ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శికే. ప్రవీణ్ ప్రకాష్.. అదే హోదాలో చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని కూడా బదిలీ చేశారు. ఇప్పుడు ఆ హోదాలోకి కేఎస్ జవహర్ రెడ్డి వచ్చారు. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి. జగన్మోహన రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన హవా కనిపిస్తోంది. కరోనా సమయంలో మొత్తం ఆయన చేతుల మీదుగానే వ్యవహారాలు నడిచిపోయాయి.
తర్వాత తనకు టీటీడీ ఈవో పోస్టు కావాలని ఆయన పట్టుబట్టడంతో ఆ పోస్టులో నియమించారు. అదే సమయంలో ఆయనను ఇతర విషయాల్లోనూ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ టీటీడీ ఈవోగా పని చేస్తూనే కరోనా కట్టడికి పని చేశారు. ఇప్పుడు కూడా సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన బదిలీ కాలేదు. టీటీడీ ఈవోగా ఆయనే ఉంటారు. అలాగే సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. తన మొదటి ప్రయారిటీ టీటీడీ ఈవో అని..దాంతో పాటు ఇంకే బాధ్యతలు ఇచ్చినా ఓకేనని ఆయన పట్టుదలగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.
అందుకే ప్రభుత్వం కూడా ఆయన కోరికను తీరుస్తోంది. ఇక నుంచి ఏపీ అధికారవర్గాల్లో జవహర్ రెడ్డి మాట అంటే శిరోధార్యమన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా చూస్తే పాలనా వ్యవహారాల్లో అన్ని స్థాయిల్లోనూ ఒకే వర్గం పెత్తనం చేలాయిస్తూడటం అధికారవర్గాల్లోనూ విస్మయానికి గురి చేస్తోంది. ఇదే పద్దతని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు కానీ బయటపడలేకపోతున్నారు.