ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని చేసే వారిని నియమించడం చూసి.. చాలా మంది ఆశ్చర్యపోయారు. అసలు ఏపీలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులే లేనట్లుగా… మరే విభాగాల్లో కింది స్థాయి సిబ్బంది లేనట్లుగా వ్యవహారం నడుస్తోంది. తాము చెప్పినట్లుగా చేసే వారిని మాత్రమే ఏరికోరి నియమించుకుంటున్నారు.
ఎన్నికల నిర్వహణలో అత్యంత ఘోర వైఫల్యం కనిపిస్తోంది. దీనికి ఈసీదే బాధ్యత. తాము చెప్పినట్లుగా అధికార యంత్రాంగాన్ని నడిపించే చీఫ్ సెక్రటరీని నియమించుకోలేకపోవడం వారి చేతకానితనమే. వైసీపీకి కొమ్ము కాసే వారిని పెట్టుకుని.. ఆ ఆదేశాలను ధిక్కరిస్తూ.. ఉండే సీఎస్ ను ఇంకా ఎంత కాలం సహిస్తారు అనేది కీలకం. ఈసీపై నిందలేయడానికి ఘర్షణలు సృష్టించినట్లుగా బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. వైసీపీ వాళ్లు దాడులు చేసి.. ఘర్షణలకు కారణం ఈసీ అని నిందిస్తున్నారంటే.. అంత కంటే సాక్ష్యం ఏమీ ఉండదు.
ఒక్క ఎన్నికల విషయమే కాదు.. మిగతా వ్యవహారాల్లోనూ సీఎస్ తీరు అత్యంత ఘోరంగా ఉంది. ఓ వైపు సుప్రీంకోర్టు అక్రమ ఇసుక తవ్వకాలపై మండి పడుతోంది. ఏపీ అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా విచారణ చేయాలని ఆదేశించాల్సిన దుస్థితికి వచ్చింది. ఇసుక తవ్వకాలు ఎక్కడా ఆగలేదు. పథకాల డబ్బులు ఇవ్వలేదు. కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. అయినా సీఎస్ ను కొనసాగిస్తున్నారు. ఆయనను ఏ అదృశ్య శక్తి కాపాడుతుందో కానీ.. ఆయనను తప్పిస్తే ఏపీ పూర్తిగా గాడిలో పడుతుందనేది అధికారవర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట.