సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి. విశాఖలో చాలా వరకూ భూములు బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరాంధ్రలో రూ.2 వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములను కొట్టేశారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. సీఎస్ అయ్యాకే భూముల మార్పిడి జీవో 596 ఇచ్చారని ఆ జీవో ఆధారంగానే సీఎస్ కుమారుడు విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు చేజిక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఎస్సీ, బీసీ అసైన్డ్ భూములను బినామీల పేరిట సొంతం చేసుకున్నారని అంటున్నారు. ఎకరం రూ.2 కోట్లు పలికే భూములను ఐదారు లక్షలకే జవహర్‌రెడ్డి ముఠా ఒప్పందాలు చేసుకుందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలపై జవహర్ రెడ్డి ఉలిక్కి పడ్డారు. బెదిరించేలా రిప్లయ్ ఇచ్చారు. ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే కేసులు పెడతామని హెచ్చరించారు. ఆయన ఉలికిపాటు చూసి.. ఏదో ఉందని రాజకీయవర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. ఇటీవల సీఎస్ జవహర్ రెడ్డి రెండు సార్లు విశాఖలో పర్యటించారు. జగన్ ప్రమాణస్వీకార ఏర్పాట్ల కోసం అని పుకారు లేపారు. కానీ అసలు విషయం వేరే ఉందని.. ఆయన భూములు చక్క బెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలు అయిపోయినందున ఈ ఆరోపణల వల్ల రాజకీయ లాభం ఉండదు… అందుకే.. నిజాలేంటో బయటకు రావాల్సి ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.