తెలుగుదేశం పార్టీలో ప్రత్యర్థులపై విరుచుకుపడే అలవాటున్న వారిలో ఎక్సయిజ్ మంత్రి జవహర్ ఒకరు. ఈ మధ్యనే ఆయన బీరు ఆరోగ్యపానీయమని కితాబునిచ్చి చిక్కుల్లో పడ్డారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై జవహర్ అస్త్రాలు సంధించడం కూడా వివాదానికే దారితీయొచ్చు. ఎందుకంటే ఏదో యథాలాపంగా కెసిఆర్ చెప్పిన స్వంత సర్వే నివేదికను ప్రభుత్వంలో వున్న మంత్రి ఆ స్థాయిలో ఖండించాల్సిన పనిలేదు. ఈ మధ్యన కెసిఆర్ ఢిల్లీలో మీడియాతో జరిపిన ఇష్టాగోష్టిలో తన సర్వే ప్రకారం 2019లో వైసీపీకి 43 శాతం, టిడిపికి 41 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైనట్టు చెప్పారు. కాస్త వెనక్కు వెళితే 2014 ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇదే రీతిలో కెసిఆర్ ఎపిలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని తన సర్వేలో తెలిసినట్టు చెప్పారు. తర్వాత అది నిజం కాలేదు. అయితే రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా ఒక్క శాతమేనన్నది నిజం. అప్పుడు బిజెపి మద్దతు కూడా టిడిపికి వుంది. ఈ సారి ఏం జరుగుతుందో తెలియదు. ఆ పార్టీతో వైసీపీతో పరోక్షంగానో ప్రత్యక్షంగానో అవగాహన కుదర్చుకోవచ్చన్న కథనాలూ వున్నాయి. కాబట్టి సర్వేలలో అలాటి అభిప్రాయాలు వస్తే రావచ్చు. ఏమైనా ఎన్నికలు ఇంకా చాలా దూరం వున్నాయి. అప్పటికి ఎవరు ఎవరితో ఎలా వుంటారో తెలియదు. కాబట్టి యథాలాపంగా కెసిఆర్ చెప్పిన దాన్ని పెద్ద సమస్యగా చేసి ప్రచారంలోకి తేవడం ప్రభుత్వానికే నష్టం.అందులోనూ ఎపిలో ఏ ప్రభావం చూపని తెలంగాణ ముఖ్యమంత్రితో తగాదా అసలే అనవసరమని చెప్పాలి. బహుశా రాజకీయ చర్చలను పక్కదారి పట్టించడానికే టిడిపి ఈ అంశాన్ని పెద్దది చేస్తుండవచ్చు.