కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి రాజ్యసభ పదవీ కాలం వచ్చే నెలతో ముగియబోతోంది. ఆయనతోబాటే వివిధ రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ సభ్యుల పదవీకాలం కూడా ముగియబోతోంది. వారిలో ఎంతమంది మళ్ళీ రాజ్యసభకు ఎన్నికవుతారో తెలియదు కనుక వారందరికీ వీడ్కోలు పలికేందుకు రేపు పార్లమెంటు సభ్యులు సమావేశం కాబోతున్నారు. అందుకోసమే పార్లమెంటు సమావేశాలు రెండు రోజుల ముందే ముగించారు. దీనిలో తప్పు పట్టడానికి ఏమీ లేదు.
విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడానికి చట్ట సవరణ చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్ర రావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై రేపు సభలో ఓటింగ్ జరుపుతామని మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అది జరిపి ఓడిపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందనే ఉద్దేశ్యంతోనే రేపు ఈ కార్యక్రమం పెట్టి మోడీ ప్రభుత్వం తప్పించుకొందని జైరాం రమేష్ విమర్శించారు.
ఒకప్పుడు యూపియే ప్రభుత్వం ప్రత్యేక హోదా ఐదేళ్ళు ఇస్తామని చెపితే ఐదేళ్ళు సరిపోదు కనీసం పదేళ్ళు కావాలని డిమాండ్ చేసిన వెంకయ్య నాయుడు, ఇప్పుడు పోతూపోతూ రేపుసభ జరుగకుండా చేసి రాష్ట్ర ప్రజలని మరో మారు మోసం చేశారని అదే ఆయన రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న చివరి బహుమతి అని జైరాం రమేష్ ఎద్దేవా చేసారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వెంకయ్య నాయుడు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామని ప్రజలకు గట్టిగా హామీలు ఇస్తుండేవారు. ఆ తరువాత 14వ ఆర్ధిక సంఘం పల్లవి అందుకొన్నారు. కొన్ని రోజుల తరువాత అసలు హోదా ఊసే ఎత్తడం మానేశారు. వెళ్ళిపోతూ ప్రత్యేక హోదా హామీని విభజన చట్టంలో చేర్చే అవకాశం కూడా లేకుండా చేసి వెళ్ళిపోతున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయనిచ్చే చివరి గిఫ్ట్ అదేనన్న జైరాం రమేష్ మాటలలో తప్పులేదు.