క్రికెట్ పాలన మొత్తం క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న వారి చేతుల్లో ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. అందకే అన్ని రాష్ట్రాల బీసీసీఐ అనుబంధ అసోసియేషన్లలో క్రికెట్ నేపధ్యం ఉన్న వారికే పదవులు లభిస్తున్నాయి. అయితే అనూహ్యంగా అసలు క్రికెట్ అనే ప్రపంచానికి నిన్నామొన్నటి దాకా ఎవరికీ తెలియని గుజరాతీ జై షా ఇప్పుడు బీసీసీఐని అనధికారికంగా పరిపాలిస్తున్నారు. రేపోమాపో అధికారికంగా పరిపాలించబోతున్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు భిన్నంగా సాగుతున్నా చెల్లిపోతోంది.
దేశ క్రికెట్‌ను గుప్పిట్లో పెట్టుకున్న ఈ జై షా ఎవరు ?. వారసత్వ రాజకీయాలపై భీకరమైన ప్రకటనలు చేసే బీజేపీ .. ఆ పార్టీని శాసిస్తున్న అమిత్ షా కుమారుడు. పొట్ట కోస్తే అక్షరం ముక్క వస్తుందో రాదో ఎవరికీ తెలియదు కానీ టెలీ ప్రాంప్టర్‌లో కూడా చూసీ చదవలేనంత అమాయకుడు. ఆయన అమిత్ షా కుమారుడు కావడం ఒక్కటే అర్హత . బీసీసీఐలో చేరిపోయారు. సౌరవ్ గంగూలీని క్రికెట్ నేపధ్యం ఉన్న ప్లేయర్‌గా పాలనలోకి తీసుకుని చీఫ్‌ను చేశారు. ఆయన ఏమైనా చేస్తారో లేదో తెలియదు కానీ.. జైషా టీమే అంతా చూస్తుంది. ఇప్పుడు నేరుగా గంగూలీని కూడా తప్పించి.. తానే చీఫ్ అవ్వాలనుకుంటున్నారు జై షా.
ఇటీవలి కాలంలో చాలా సార్లు గంగూలీ .. బీసీసీఐ చీఫ్‌గా రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఎప్పటికప్పుడు ఖండించారు. ఆయన రాజీనామా చేయలేదు. ఇప్పుడు ఆయనను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు పంపాలనే ఆలోచన చేస్తున్నారు . ఐసీసీ చైర్మన్‌గా గంగూలీని పంపించి.. బీసీసీఐ చీఫ్‌గా పగ్గాలు చేపట్టనున్నారు జైషా. ఇప్పటి వరకూ ఆయనను బెంగాల్ రాజకీయాల్లోకి నెట్టాలనుకున్నారు. కానీ గంగూలు ఆశపడకపోవడంతో ఐసీసీకి నెట్టేస్తున్నారు. అయితే అసలు జై షాకు బీసీసీఐని నడిపేందుకు ఉన్న అర్హత ఏమిటి ? అన్నది అందరికీ సమాధానం తెలిసిన ప్రశ్న.