కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, ఐసీసీ చైర్మన్ జై షా తో నారా లోకేష్ కు ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. విశాఖలో ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు జై షా ప్రత్యేకంగా వచ్చారు. నారా లోకేష్ ఈ మ్యాచ్ కోసం ఆయనను వచ్చేలా ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచులు జరిగిన చోటకల్లా జై షా వెళ్లరు. కానీ విశాఖ వచ్చారు. మ్యాచ్ తర్వాత ఓ సంప్రదాయ తెలుగు వంటకాల హోటల్ కు వెళ్లి డిన్నర్ కూడా చేశారు.
ఎప్పుడు వారి వైపు కెమెరా కనిపించినా ఆప్తమిత్రుల్లా మాట్లాడుకుంటూ కనిపించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు .. ఐసీసీ చైర్మన్ జై షా నారా లోకేష్ ను ఆహ్వానించారు. అప్పుడు లోకేష్ కూడా వెళ్లివచ్చారు. అప్పుడే వారు మిత్రులుగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మరోసారి వారి మధ్య ప్రెండ్ షిప్ హైలెట్ అయింది.
జై షా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. క్రికెట్ వ్యవహారాలనే చూసుకుంటున్నారు. ఐసీసీ చైర్మన్ గా ఉన్న ఆయనకు బీసీసీఐలోనూ తిరుగులేని పట్టు ఉంది. ఆయన తల్చుకుంటే ఏపీకి ఓ ఐపీఎల్ టీమ్ వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియమూ వస్తుంది. ఈ విషయంలో నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారని అనుకోవచ్చు. ఏపీలో క్రికెట్ మెరుగుకు జైషా సహకరించే అవకాశాలు ఉన్నాయి.