ఆరోగ్యశ్రీ అనే పథకం చాలా అద్భుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పథకం కింద సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందుతోంది. కానీ ఖర్చు లేకుండా.. మంచి వైద్యం పొందగలుగుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతున్నారు. కానీ అదే సమయంలో.. ఇదే పథకం ముసుగులో వందల వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్న మాట కూడా వాస్తవం. కార్పొరేట్ ఆస్పత్రిలో ఒక రోగి అడుగుపెడితే చాలు.. వాడికి ఆరోగ్యశ్రీ అర్హత ఉన్నదో లేదో చెక్ చేసుకోవడం.. అవసరం ఉన్నవీ లేనివీ నానా ఆపరేషన్లు చేసేయడం.. అనేది ఒక కామెడీగా మారిపోయింది. ఇందులో ఖచ్చితంగా కార్పొరేట్ ఆస్పత్రులు, వారికి కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలు వాటాలు పంచుకుంటూ ఉన్నాయన్నది కూడా వాస్తవం.
ఈ నేపథ్యంలో దేశంలో ప్రతి ఒక్కరికీ సరైన వైద్యం అందడానికి లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ ఒక మంచి ప్రణాళికను తయారుచేస్తే.. దోపిడీ ప్రభుత్వాలు దానిని ఆమోదిస్తాయా లేదా అన్నది మీమాంస. లోక్ సత్తాను రాజకీయ పార్టీ గా రద్దుచేసి పూర్వపు తరహాలో ప్రజాఉద్యమాలు నడిపే సంస్థగా జయప్రకాశ్ నారాయణ్ మళ్లీ పూర్వ వైభవ స్థితికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. రాజకీయాలనుంచి బయటకు రావడాన్ని అనేకమంది హర్షించారు.
ఆయన ఇప్పుడు లోక్ సత్తా తరఫున నీతి ఆయోగ్ వద్దకు దేశ ప్రజలందరికీ మంచి వైద్యం అందించే ఓ సరికొత్త ఆలోచనను తీసుకెళ్లబోతున్నారు. ఈ ప్రణాళికలో ప్రతి 5వేల మందికి ఓ డాక్టరుంటాడు. దేశంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య చరిత్ర కంప్యూటరీకరిస్తారు. వైద్యసేవలు, చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించాలి. ఏ వైద్యుడి వద్ద సేవలు పొందాలి అనే విషయాన్ని రోగి నిర్ణయించుకుంటాడు… ప్రభుత్వ ఆసుపత్రులన్నిటినీ కూడా దీని పరిధిలోకి తెస్తారు. జేపీ ప్రణాళికల పరంగా అద్భుతమైన ఆలోచనలనే ప్రభుత్వం ముందుకు తీసుకువెళతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పథకాలలో అవినీతికి ఆస్కారం కూడా ఉండకపోవచ్చు. కానీ ఆరోగ్యశ్రీ గానీ, లేదా అలాంటి ఇతర పథకాల రూపేణా గానీ.. కార్పొరేట్ ఆస్పత్రులతో లాలూచీ పడి వారికి దోచిపెట్టడం అనేది రివాజుగా మార్చుకున్న రాజకీయ పార్టీలు, దోపిడీ ప్రభుత్వాలు ఈ వ్యవహారాన్ని పద్ధతిగా ముందుకు సాగనిస్తాయా అనేది పలువురిలో రేగుతున్న సందేహం. మరి జేపీ నీతి ఆయోగ్ ముందు దీనిని ప్రజంటేషన్ ఇచ్చి ఎలాంటి ఫలితం సాధిస్తారో చూడాలి.