ఎన్నికలలోపోటీ చేయకూడదని లోక్‌సత్తా తీసుకున్న నిర్ణయం వెనక చాలా కోణాలున్నాయి. పదేళ్ల కిందట జయప్రకాశ్ నారాయణ్ కొంతమంది బుద్ధిజీవులకూ ఆదర్శాలు కోరేవాళ్లకు ఒక ఆశాదీపంలా వుండేవారు. లోక్‌సత్తా స్వచ్చంద సంస్థ పేరిట మొదట రకరకాల కార్యక్రమాలు శిక్షణా తరగతులు పెట్టి తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చారు. అయితే ముఖ్య విషయం ఏమంటే ఆ తదనంతరం కూడా లోక్‌సత్తా స్వచ్చంద సంస్థ యథాతథంగానే కొనసాగుతూన్నది. స్వచ్చమైన రాజకీయం కావాలని చెప్పిన జెపి మీడియా చర్చలలో అన్ని పార్టీలనూ కలిపి సంప్రదాయ రాజకీయ పార్టీలు అంటుండేవారు. ఆయన మాటల్లో చట్టాలను వివరించడం, వాటిద్వారానే మార్పు సాధించవచ్చుననే భావం ఎప్పుడూ ధ్వనిస్తుండేవి. వామపక్షాలు మంచివని అంటూనే కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకుని వేళ్లాడుతున్నట్టు చాలాసార్లు వ్యాఖ్యానించేవారు.
మేము చర్చలలో తీవ్రంగా వాదించుకున్న సందర్భాలు చాలా వున్నాయి. మీరు నన్ను విమర్శించడమెందుకు అని ఆయన చాలాసార్లు ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. అంతా చెడిపోయిందన్నట్టు మాట్లాడ్డం బాగాలేదని, పైగా లౌకికతత్వం మతతత్వం, ఆధిపత్యం అణచివేత వంటి పలు అంశాలు అస్సలు ప్రస్తావించడం లేదని నేనంటుండేవాణ్ణి.
అమెరికాను ఆదర్శంగా చూపించడం, అమెరికాతో సంబంధాలను ప్రభుత్వాల స్థాయి నుంచి ప్రజల మధ్య సంబంధాల స్థాయికి తీసుకుపోవడం లోక్‌సత్తాతో వెబ్సైట్లో కనిపించే మరో సంస్థ లక్ష్యాలుగా వుండేవి. దీంతో కూడా నేను ఏకీభవించలేదు. అయినా మంచి స్నేహితులుగా వుండటమే గాక వారి కార్యక్రమాలకు పలుసార్లు ఆహ్వానించారు కూడా. నేను కార్యక్రమాల కోసం వివిధ జిల్లాలకు వెళ్లినప్పుడు అక్కడుండే లోక్‌సత్తా నాయకులు అభిమానులు చాలామంది వచ్చి కలుసుకుంటుండేవారు. జెపి పై అభిమానం ప్రకటిస్తూనే అనుకున్నంత అభివృద్ధి లేదని ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలను చెబుతున్నట్టు కనిపిస్తుందని అంటుండేవారు. 2009 ఎన్నికలలో కుకట్పల్లి నుంచి జయప్రకాశ్ నారాయణ్ విజయం సాధించడానికి నాటి ప్రత్యేక పరిస్థితులు ఆ నియోజక వర్గ సామాజిక పొందిక కూడా కారణమైనాయి. అయితే ఆ సభ మొత్తం విభజన చుట్టూనే తిరిగి ముగిసిపోయింది. ఈ కాలంలో జరిగిన స్థానిక ఎన్నికలలో గాని, ఉప ఎన్నికలలో గాని లోక్‌సత్తా ఎంత ప్రయత్నించినా ఎలాటి ప్రభావం చూపింది లేదు.
ఒకటి రెండు సార్లు వామపక్షాలతో అవగాహనకు కూడా వచ్చింది. కొన్ని చోట్ల మినహా వామపక్షాలకూ బలం చాలా పరిమితమే. ఆర్థిక వనరులు బౌద్ధిక వనరుల విషయానికి వస్తే లోక్‌సత్తాకు వున్న మేరకు కూడా వాటికి వుండవు. అయితే ప్రజా ఉద్యమాలు ప్రజా సంఘాలు పోరాట సంప్రదాయాలు వాటిని సజీవంగా వుంచుతున్నాయి. ఎన్నికల్లో చాలా తక్కువ సీట్లే వచ్చినా సరే ఆ కారణంగా ఉనికిని ప్రశ్నించే పరిస్థితి ఇంతవరకూ రాలేదు. ఇక్కడే లోక్సత్తాకూ వాటికి ప్రధానమైన తేడా కనిపిస్తుంది. స్వతహాగా ఉద్యమాలు నిరసనలు వద్దని చెప్పే జెపి ఒక దశలో నిరాహారదీక్షకూడా చేయవలసి వచ్చింది. తెలుగుదేశం వారు విమర్శ చేస్తే ధర్నా కూడా చేశారు.
యుపిఎ హయాంలో సలహా సంఘ సభ్యులుగా వున్న జెపి ఎన్‌డిఎ హయాంలోనూ అలాటి ప్రయత్నాలు చేస్తున్నట్టు బిజెపి నేతలు చెబుతుంటారు. పైగా మోడీ విధానాలను లేదా బిజెపి అసహన రాజకీయాలను సుతిమెత్తగా ప్రస్తావించడం తప్ప జెపి ఎన్నడూ నిశితంగా విమర్శించింది లేదు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను బిచ్చగాళ్లుగా చేస్తున్నాయంటూనే సంపన్నులకు మేలు చేసే సరళీకరణ సంస్కరణలను ఆయన స్వాగతించేవారు. ఇంకా చెప్పాలంటే ఈ సరళీకరణ నిజమైంది కాదనేది ఆయన భావన.
రాష్ట్ర విభజన సమయంలో సంస్థాగత సంక్షోభం కూడా ఆ పార్టీని ఆవరించింది. తనకు నచ్చిన వ్యక్తిని నాయకుడిగా చేశారనే విమర్శనెదుర్కొన్నారు. పరస్పర వైరుధ్యాలతో కూడిన ఈ పోకడలే లోక్‌సత్తా రాజకీయ ప్రాధాన్యతను తగ్గించి వేశాయని చెప్పాలి. ఎన్నికల పోరాటంలో పాల్గొనకపోతే ఎన్జీవోగా మనుగడ సాగించడం తప్ప దానికి మరో అవకాశముండకపోవచ్చు. సమరశీల ఉద్యమాలు నడపడం, కార్యకర్తలకు సహాయకులకు క్రియాశీల బాధ్యతలు అప్పగించడం లోక్‌సత్తాలో వైఖరి కాదు. దానిది ప్రపంచ బ్యాంకు చెప్పే ఎన్జీవో జోక్యానికి రాజకీయ పాత్రకు అది.
ఢిల్లీలో ఆప్ విజయం సాధించిన తర్వాత లోక్‌సత్తా పాత్ర మరింత విమర్శకు గురైంది. ఆప్‌తో సంబంధాలు పెంచుకోకపోగా తమలో లీనం కావాలన్నట్టు లేదా తెలుగు రాష్ట్రాల్లో ఆప్‌ను స్థాపించకుండా తమనే గుర్తించాలన్నట్టు జెపి పెట్టిన షరతులు సహజంగానే వారికి ఆమోదయోగ్యం కాలేదు. పైగా మధ్యతరగతితో పాటు సామాన్య ప్రజల్లోకి కూడా చొచ్చుకుపోయిన ఆప్ సమిష్టి బృందం చర్యలు లోక్‌సత్తా అనుసరించే అవకాశం లేదు. కేజ్రీవాల్ రిలయన్స్‌తో సహా కార్పొరేట్లపై చాలా విమర్శలు చేశారు. మోడీని డ్డీకొని ఘోర పరాజయం పాలు చేశారు. ఇవన్నీ లోక్‌సత్తాకు మరీ ముఖ్యంగా జెపి వ్యవహార శైలికి సరిపడేవి కావు. పైగా ఆ పార్టీ ఆ స్థాయికి చాలా చాలా దూరంలోనే వుండిపోయింది. ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంది.
చిరంజీవి ప్రజారాజ్యం కూడా మధ్యలో వచ్చి తెలంగాణలో దేవేందర్ గౌడ్ పార్టీని కూడా కలుపుకుని కాస్త ప్రభావం చూపి కాంగ్రెస్‌లో కరిగిపోయింది. పవన్ కళ్యాణ్ జనసేన ఇంకా రూపమే తీసుకోకుండా బిజెపికి మద్దతు నిచ్చే పాత్రకు పరిమితమైంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ముందు నామకార్థంగా స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ గురించి ఆయనే మర్చిపోయారు! ఇవన్నీ మనకు రకరకాల గుణపాఠాలు అందిస్తున్నాయి. తెలంగాణ సాధన దశలో సమస్తాన్ని శాసించినట్టు కనిపించిన కోదండరాం జెఎసి ఇప్పుడు కొత్త పాత్రను వెతుక్కుంటున్నదే గాని తనను తాను రద్దు చేసుకోవడానికి సిద్ధం కావడం లేదు. అంటే ప్రజలతో వుండటం ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచించడం ముఖ్యం. వాటిని నమ్మిన వారికి మనుగడ సమస్య వుండదు.