ప్రముఖ తమిళ నటుడు మరియు డిఎండికె పార్టీ అధినేతపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈరోజు పరువు నష్టం దావా వేశారు. రెండు నెలల క్రితం అంటే డిశంబరులో చెన్నైలో వచ్చిన వరదలు కృత్రిమంగా ఏర్పడినవని ఆయన ఆరోపించారు.
ఒక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారం ప్రకారం చెన్నైలో మురుగునీరు సముద్రంలోకి పోయే కాలువాలన్నీ కబ్జాలకు గురవడంతో, అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలు వలన వచ్చిన నీరు బయటకు వెళ్ళే మార్గం లేకపోవడం వలననే నగరం నీళ్ళలో మునిగిపోయిందని పేర్కొంది. నగరంలో ప్రధాన కాలువలు కబ్జాలకు గురవుతున్నాయని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలననే ఈ సమస్య తలెత్తిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. రాజకీయాలలో ఉన్న విజయ్ కాంత్ దాని ఆదరంగానే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలు జయలలిత(ను) అమితంగా ద్వేషించే డిఎంకె పార్టీకి చెందిన మురసోలి అనే పత్రికలో ప్రచిరితం అయ్యేయి. దానిని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి జయలలిత విజయ్ కాంత్ పై పరువు నష్టం దావా వేశారు.
ఆమె తరపున ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఎల్. జగన్ చెన్నై ప్రధాన సెషన్స్ కోర్టులో దావా వేశారు. తన క్లయింట్ పై విజయ్ కాంత్ నిరాధారమయిన ఆరోపణలు చేసి ఆమె పరువుకు నష్టం కలిగించారని తన దావాలో పేర్కొన్నారు. ఆ కేసును విచారణకు స్వీకరించిన సెషన్స్ కోర్టు విజయ్ కాంత్ కి నోటీసు జారీ చేసింది.
ఒక సాధారణ విమర్శను పట్టుకొని ముఖ్యమంత్రి జయలలిత విజయ్ కాంత్ పై పరువు నష్టం దావా వేయడం విమర్శలను సహించలేని ఆమె అసహనానికి నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది లేదా త్వరలో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయనని ఇబ్బంది పెట్టడానికయినా అయ్యుండాలి లేకుంటే రాజకీయాలలో ఇటువంటి విమర్శలు ఎవరూ ఇంత గంభీరంగా తీసుకోరు.