హైదరాబాద్: చెన్నైలో సహాయక చర్యల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలిపోయిందని కమల్ హాసన్ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి జయలలిత అనుచరులు మండిపడుతున్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అర్థికమంత్రి పన్నీర్ సెల్వమ్ ఒక ప్రకటనలో కమల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కమల్ మాటలు బుద్ధి సరిగా ఉన్నవాళ్ళు మాట్లాడేవిలాగా లేవని మంత్రి అన్నారు. ఆయన అంతా తనకే తెలుసన్నట్లు మాట్లాడుతున్నారని, కానీ ఆయనకు వాస్తవ పరిస్థితి ఏమీ తెలియదని చెప్పారు. సినిమాలో ఒక్క సీన్‌తోనో, ఒక్క పాటతోనో వరద పరిస్థితిని చక్కదిద్దినట్లు చూపించొచ్చుగానీ, వాస్తవ జీవితంలా అలా వీలుకాదని, ఒకదాని తర్వాత మరొకటిగా చేసుకుంటూ పోవాలని అన్నారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే కమల్ నటించిన అన్బే శివం చిత్రాన్నే చూడొచ్చని సూచించారు. సహాయక చర్యలు సజావుగా సాగుతున్నాయని, ప్రభుత్వంపేరు చెడగొట్టటంకోసమే కమల్ ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. విశ్వరూపం చిత్రం విడుదల ఆగిపోయినపుడు ముఖ్యమంత్రి జయలలిత ఆయనకు ఎంతో సాయం చేశారని, కానీ ఇప్పుడు ఆమెనే కమల్ ప్రశ్నిస్తున్నారని మంత్రి విమర్శించారు. కమల్ ఇటీవల ఒక ఎడ్వర్టయిజ్మెంట్లో నటించి దానిద్వారా వచ్చిన డబ్బును ఒక ఎన్జీఓకు ఇస్తున్నట్లు ప్రకటించారని, కానీ ఆ సంస్థ తమకు విరాళమేమీ అందలేదని చెప్పిందని గుర్తు చేశారు. విరాళం ఇచ్చినట్లయితే కమల్ ఆ వివరాలు బయటపెట్టాలని అన్నారు. కమల్ పిచ్చిమాటలను తాము భరించబోమని హెచ్చరించారు.
వాస్తవానికి కమల్ హాసన్ విమర్శలు నూటికి నూరుపాళ్ళు నిజం. సహాయక చర్యలలో జయ ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. చెన్నై ప్రజలు ముక్తకంఠంతో ఆ మాట చెబుతున్నారు. సహాయక చర్యలలో సమన్వయం కొరవడింది. అన్నివైపులనుంచి ఎంతో సహాయక సామాగ్రి, వాలంటీర్లు వస్తున్నప్పటికీ, వాటిని సద్వినియోగం చేయటానికి, బాధితులకు చేరవేయటానికి ఒక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దీనితో రాజకీయ నాయకులు, అల్లరిమూకలు ఈ సహాయక సామాగ్రిని హైజాక్ చేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు. దీనినే కమల్ తన ఇంటర్వ్యూలో చెప్పారు. వాస్తవంతో పోల్చుకుంటే కమల్ చేసిన విమర్శలు చాలా మృదువుగా ఉన్నాయని చెప్పాలి.