తమిళనాడు అసెంబ్లీ కి మే 16 న జరిగే ఎన్నికల్లో బహుముఖ పోటీలు, మూడుకూటముల మధ్య పోటీగా మారిపోయాయి. 234 శాసనసభా స్ధానాలు వున్న ఆరాష్ట్రంలో పోటీదశలోనే ఎఐడిఎంకె ఆధిక్యత కనిపించేలా ముఖ్యమంత్రి, ఆపార్టీ అధినేత్రి జయలలిత సాహసమైన మైండ్ గేమ్ మొదలు పెట్టారు.
227 నియోజకవర్గాల్లో అన్నాడిఎంకె అభ్యర్థులు పోటీలో ఉంటారని జయలలిత అధికారికంగా వెల్లడించారు. తమ మిత్రపక్షాలైన చిన్నా చితక పార్టీలకు ఏడు సీట్లను కేటాయించినప్పటికీ అవి కూడా ‘రెండాకుల’ గుర్తుపైనే పోటీ చేయాలని షరతు పెట్టారు. డిఎంకె సారధ్యంలోని కూటమి, డిఎండికె- ప్రజాసంక్షేమ కూటముల్లో సీట్ల సర్దుబాట్ల ఒక కొలిక్కి రాకముందే జయలలిత చేసిన ప్రకటన ద్వారా ఎఐడిఎంకె కూటమి లో ఏ అస్పష్టతా లేని ఆధిక్యతగురించి ప్రజల్లోకి సంకేతం పంపించారు.
కాంగ్రెస్తో ఊగిసలాడుతున్న డిఎంకె కూటమి కూడా ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ వైపు గులాబీనబీ ఆజాద్, డిఎంకె పక్షాన కరుణానిధిల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. మొండిగా ఉన్న కాంగ్రెస్ 41 సీట్లతో సరిపెట్టుకుంది. దీంతో పాటు ఎంఎంకె 5, మైనార్టీలకు 5, ఇతర చిన్న పార్టీలకు 3 సీట్లను ఖరారు చేశారు. డిఎంకె 180 సీట్లలో పోటీ చేయనుంది. ఈ కూటమి అధికారం లోకి దవస్తే తూ కాంగ్రెస్ మద్దతు ఉంటుందే తప్ప, భాగస్వామ్యం ఉండబోదని తేల్చి చెప్పారు.
డిఎండికె-ప్రజాసంక్షేమ కూటమి కూడా సీట్ల పంపకాలను పూర్తి చేసుకున్న విషయం విదితమే. వామపక్షాలు తమకు గతంలో 19 సీట్లున్నాయని, మరికొన్నింటిలో సర్దుబాట్లు చేసుకోవాలని కోరడంతో.. మరో 10 స్థానాలు వామపక్షాలకు ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో 45 స్థానాల్లో అవి పోటీ చేయనున్నాయి. చెన్నరు శివారులోని మామండూరులో జరిగే ఎన్నికల మహానాడులో మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని వైగో ప్రకటించారు.
జయలలితక 2011లో శ్రీరంగం నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొని జైలుకు సైతం వెళ్లారు. నిర్దోషిగా బయట పడిన జయలలిత.. ఉప ఎన్నికల్లో ఆర్కె నగర్ నుంచి పోటీచేసి గెలుపొంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2016 ఎన్నికల్లోనూ మురికివాడయిన ఆర్కె నగర్ నుంచే పోటీ చేస్తున్నారు. గత క్యాబినెట్లో 27 మంది మంత్రివర్గ సభ్యులుగా ఉండగా వారిలో పది మందికి ఈసారి టికెట్లను ఇవ్వకపోవడం గమనార్హం.