చెన్నైలోని ఆర్కే నగర్ నియోజక వర్గానికి గురువారం ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటిది వీడియో ఇదీ అంటూ ఓ ఫుటేజ్ ప్రచారంలోకి వచ్చింది. అది నిజమైందో, ఫేక్ వీడియోనో తెలీదుగానీ సోషల్ మీడియా, టీవీ మీడియా, వెబ్ మీడియా… ఇలా అంతటా ఇదే అంశం వైరల్ అయిపోయింది. జయలలిత మరణానికి ముందు కొన్ని నెలలపాటు ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే కనీస సమాచారం కూడా అప్పట్లో బయటకి పొక్కనీయకుండా చేశారు. చివరికి, ఆసుపత్రి నుంచి మెడికల్ బులిటెన్లు కూడా సక్రమంగా వచ్చేవి కావు. ఆమె కోలుకుంటున్నారనీ, కొద్దిరోజుల్లో డిశ్చార్జ్ అనీ ఇలా చెప్పీ చెప్పీ… చివరికి ఆమె మరణ వార్తను బయటపెట్టారు. దాంతో అప్పట్నుంచీ అమ్మ మరణంపై చాలా అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. జయలలిత మరణానికి కారణం శశికళ కుట్ర అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఆ మిస్టరీ అలానే ఉండిపోయింది.
అయితే, ఇప్పుడు అదే మిస్టరీతో ఆర్కే నగర్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చిన్నమ్మ వర్గం భావిస్తోందన్ని స్పష్టంగా అర్థమౌతోంది. ఇప్పుడీ వీడియో లీకేజీతో అమ్మ సెంటిమెంట్ ను రెచ్చగొట్టొచ్చు అనేది దినకరన్ వర్గం వ్యూహం. జయలలిత మరణానికి కారణం శశికళే అంటూ అధికార పార్టీతోపాటు డీఎంకే నాయకులు కూడా అప్పట్లో భారీ ఎత్తున ఆరోపణలు చేశారు. ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో కూడా దినకర్ వర్గానికి బాగా ఇబ్బంది పెట్టిన అంశం ఇది. కాబట్టి, దీన్నుంచి విముక్తి పొంది… ఎన్నికల్లో లబ్ది పొందాలంటే ఈ వీడియో బలమైన సాధనంగా పనికొస్తుందనే వారి ఎత్తుగడ అర్థమౌతూనే ఉంది.
అయితే, ఇక్కడే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమ్మ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఎంతటి కట్టుదిట్టమైన భద్రత ఉండేదో తెలిసిందే. ఆమె చికిత్స పొందుతున్న గది వైపు ఎవ్వరికీ అనుమతి లేదనీ, సీసీ టీవీ కెమెరాల్లేవనీ, అక్కడికి వెళ్లే సిబ్బందికి సెల్ ఫోన్లు కూడా తీసుకెళ్లరనీ… ఆసుపత్రి భద్రత ఆ స్థాయిలో ఉందంటూ అప్పట్లో యాజమాన్యం బీరాలు పలికారు. మరి, అలాంటప్పుడు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చినట్టు..? దీన్ని ఎవరు బయట పెట్టినట్టు..? తమది అంత గొప్ప భద్రతా వలయం అని చెప్పుకునే ఆసుపత్రి వర్గాలే దీన్ని ఇప్పుడు బయటకి తెచ్చాయా..? ఇన్నాళ్లూ ఈ వీడియో బయటకి ఎందుకు రానట్టు..? అమ్మ మరణించి ఇన్నాళ్లు అవుతున్నా.. ఆమె మరణానికి కారణం శశికళే అని అందరూ ఆడిపోసుకుంటున్నా, దినకరన్ వర్గం దీన్ని బలంగా తిప్పి కొట్టే ప్రయత్నం ఇంతవరకూ చేయలేదు. సరిగ్గా ఎన్నికల ముందురోజు వరకూ ఆగి.. ఇలాంటి వీడియో లీక్ చేయించారంటే.. దీన్ని ఏ తరహా రాజకీయం అనాలి..? అమ్మ మరణాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుని, సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఓట్లేయించుకోవడం ఒక్కటే ఈ వీడియో లక్ష్యం. అంతేగానీ, దీని ద్వారా తమ సత్యసంధతను నిరూపించుకునే ప్రయత్నం చేశామని చిన్నమ్మ వర్గం చెప్పుకుంటే.. అంతకంటే హాస్యాస్పదమైన అంశం మరొకటి ఉండదు.