జయప్రద పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ రాజకీయం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం.. ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అజంఖాన్ వ్యవహారమే. ఆయన సమాజ్ వాదీ పార్టీకి.. ముస్లిం ఫేస్‌గా ఉన్నారు. ఆ పార్టీకి ముస్లిల మద్దతు కూడగట్టడంలో అజంఖాన్ది కీలకమైన పాత్ర. అంతే కాదు… రాంపూర్‌కి… తిరుగులేని నేతగా.. దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. అయితే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. ఇప్పుడు కూడా.. ఆ ధోరణిని మార్చుకోలేదు. జయప్రదపై అదే తరహా విమర్శలు చేస్తున్నారు. ఈ సారి జయప్రద బీజేపీ తరపున పోటీ చేస్తూండటంతో.. ” జయప్రదను రాంపూర్ తీసుకొచ్చింది నేనే. అయితే ఆమె ఖాకీ అండర్ వేర్ ధరించిందని గుర్తించలేకపోయా..” అంటూ విమర్శలు చేశారు. దీనిపై దుమారం రేగింది.
అజాంఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. దీంతో ఆత్మరక్షణలో పడిన ఆయన ఇప్పుడు నష్ట నివారణ ప్రయత్నాలు మొదలుపెట్టారు. జయప్రదపై తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదనీ… ఆమెనుద్దేశించి మాట్లాడినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో నుంచి తప్పుకుంటానని సవాల్ చేస్తున్నారు. తాను జయప్రదనుద్దేశించి ఆ మాటలు అనలేదని.. మగవాళ్ల గురించి మాట్లాడానంటున్నారు. కొద్ది రోజుల క్రితం… జయప్రదను డాన్సర్ గా అభివర్ణించారు. రాంపూర్ నుంచి గతంలో జయప్రద రెండు సార్లు సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించింది. ఆ సమయంలో… అజంఖానే ఆమె తరపున ఎన్నికల బాధ్యతలు తీసుకుని గెలిపించారు. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది.
ములాయం సింగ్ యాదవ్ చేతుల్లో ఎస్పీ ఉన్నప్పుడు.. అమర్ సింగ్ ఆశీస్సులతో జయప్రద రాజకీయం చేశారు. ఆయన ఆశీస్సులతోనే రాంపూర్ నుంచి ఎంపీ అయ్యారు. కానీ తర్వాత అజంఖాన్ తో విబేధాలొచ్చాయి. ఆ తర్వాత అమర్ సింగ్ బీజేపీకి దగ్గరయ్యారు. అమర్ సింగ్ ఎస్పీకి దూరమైన తర్వాత వేరే పార్టీ పెట్టుకుని ఆ పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ.. జయప్రదకు డిపాజిట్లు దక్కలేదు. ఈ సారి బీజేపీ తరపున..అమర్ సింగ్ సాయంతో టిక్కెట్ సంపాదించారు. దాంతో.. గతంలో తనను గెలిపించిన అజంఖాన్‌తో… జయప్రద పోటీ పడాల్సి వచ్చింది. జయప్రదపై.. దారుణమైన విమర్శలతో ఆయన విరుచుకుపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు… అందరి దృష్టి రాంపూర్ వైపు పడేలా చేస్తున్నాయి.