వచ్చే నెలలో రాజ్యసభ స్థానాలకు ఎన్నిక రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ముగ్గురు ఎంపీల పదవీ కాలం పూర్తి కావడంతో ఆ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీటిలో రెండు స్థానాలు అధికార పార్టీ తెలుగుదేశానికి దక్కగా, ఒక స్థానం వైకాపాకి దక్కుతుంది. నిజానికి, ఈసారి రాజ్యసభ ఎంపీలుగా ఎవర్ని ఎంపిక చేయాలనే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొంతమంది పార్టీ కీలక నేతలతో చర్చించినట్టు సమాచారం. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణను రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పేరును దాదాపుగా ఖరారు చేసినట్టుగానే సమాచారం.
జేపీని రాజ్యసభకు పంపడంపై ఇప్పటికే చంద్రబాబు ఓ సర్వే చేశారనీ, ఆయన్ని ఎంపిక చేయడంపై ఎలాంటి వ్యతిరేకతా రాలేదని సమాచారం. నిజానికి, సినీ నటుడు చిరంజీవి పేరును ప్రతిపాదించి మరోసారి రాజ్యసభకి పంపాలనే కోణంలో కూడా సర్వే చేయించారట. ఎందుకంటే, తన అన్నను రాజ్యసభకు పంపించాలనే ప్రతిపాదనను పవన్ కల్యాణ్ తెర మీదికి తీసుకొచ్చినట్టు సమాచారం. కానీ, చిరంజీవిపై చాలా వ్యతిరేకత వ్యక్తమైందని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఎంపీగా ఉన్నా కూడా రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడిందీ లేదు, పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడమూ లేదు. చిరంజీవిపై సర్వేలో కూడా ఇదే తరహా వ్యతిరేకత వ్యక్తమౌనట్టు చెబుతున్నారు. దీంతో జేపీ పేరును ఖరారు చేయాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారట.
నిజానికి, జేపీ పేరు ప్రతిపాదిస్తే పవన్ కల్యాణ్ నుంచి మద్దతు రావడం ఖాయం. ఎందుకంటే, జె.ఎఫ్.సి. ఏర్పాటు చేసి.. ఆయనకే బాధ్యతలు అప్పగించారు. ఆయనంటే జనసేనానికి చాలా గౌరవం ఉంది. పైగా, జేపీ వివాద రహితుడు, మేధావిగా మంచి పేరుంది. ఆయన పేరు ప్రతిపాదిస్తే టీడీపీలో కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం దాదాపు తక్కువే. విషయ పరిజ్ఞానంతోపాటు, చక్కటి వాక్చాతుర్యం ఉన్న జేపీని రాజ్యసభకు పంపించాలనుకోవడం మంచి ఆలోచనే.