గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. రేపు ఎన్నికలు జరుగుతాయి. కనుక ఈ రెండు రోజుల వ్యవధిలో చేయవలసిన అసలయిన ‘పంపకాల కార్యక్రమాలు’ చాలా గుట్టుగా జరిగిపోతుంటాయి. ఎన్నికల ప్రచార సభలలో ఎవరు ఎంత గొప్పగా ప్రచారం చేసుకొన్నప్పటికీ, అభ్యర్ధుల భవిష్యత్ ని నిర్ణయించేది ఈ రెండు రోజులలో జరిగే పంపకాలేనని అందరికీ తెలుసు. ఇందుకు ఏ పార్టీ కూడా అతీతం కాదు. లోక్ సత్తా పార్టీ కూడా ఈ ఎన్నికలలో పోటీ చేస్తోంది కానీ అది ‘ఈ విషయంలో’ తెరాస, తెదేపా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోటీ పడే పరిస్థితి లేదు. అందుకే ఆ పార్టీ నేత జయప్రకాష్ నారాయణ ఆ నాలుగు ప్రధాన పార్టీలు కలిసి ఈ ఎన్నికలను ఒక గుర్రపు పందేలుగా, ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచుల్లా మార్చేసాయని విమర్శించారు.
నిన్న ఖైరతాబాద్ డివిజన్ నుంచి లోక్ సత్తా అభ్యర్ధి సుజాత తరపున ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, “అన్ని ప్రధాన రాజకీయపార్టీలు అవినీతికి పాల్పడి దోచుకొన్న సొమ్మును ఈ ఎన్నికలలో విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నాయి. ఈ ఎన్నికలలో గెలిచేందుకు ప్రధాన పార్టీల అభ్యర్దులు కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ సాధారణమయిన ఈ ఎన్నికలను అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు తీసిపోని స్థాయికి చేర్చేసారు. వార్డు స్థాయిలో సమస్యల పరిష్కారానికి కార్పోరేట్ సభ్యులను ఎన్నుకోవడానికి జరుగుతున్న ఈ ఎన్నికలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యక్తిగత పోరాటంగా మార్చేసారు. లోక్ సత్తా పార్టీకి జెండాలు ప్రధానం కాదు ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా పెట్టుకొని పోటీ చేస్తోంది. కనుక లోక్ సత్తా అభ్యర్ధికే ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్ధిస్తున్నాను,” అని జయప్రకాష్ నారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.