హైదరాబాద్: లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల నియామకాలపై సుప్రీం కోర్ట్ ఇవాళ ఇచ్చిన తీర్పుపై ఆయన మండిపడ్డారు. రాజ్యాంగాన్ని సుప్రీంకోర్ట్ భ్రష్ఠు పట్టించిందని అన్నారు. పార్లమెంట్, ప్రజల భాగస్వామ్యం లేకుండా న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. కొలీజియం వ్యవస్థను సుప్రీంకోర్టు సమర్థించటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దశాబ్దకాలంగా జాతీయ న్యాయ నియామక వ్యవస్థను సమర్థించినవారిలో తానూ ఒకడినని జేపీ ఇవాళ హైదరాబాద్‌లో చెప్పారు. ప్రజాస్వామ్యంలో జడ్జిలను హైకోర్ట్ నియమించే పద్ధతి లేదన్నారు. సుప్రీం కోర్ట్ తీర్పుపై సమగ్ర చర్చ జరగాలని వ్యాఖ్యానించారు. ఈ తీర్పుపైన తాము రాష్ట్రపతిని, అన్ని పార్టీల నేతలను కలుస్తామని చెప్పారు. వారిని వారే నియమించుకోవటానికి న్యాయమూర్తులేమీ దేవదూతలు కారని అన్నారు. కొలీజియం వ్యవస్థను సుప్రీం కోర్ట్ సమర్థించటంపై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
జడ్జిల నియామకానికి గత ఏడాది ఏర్పాటు చేసిన నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్ట్ ఇవాళ తీర్పు ఇచ్చింది. పాత పద్ధతిలోనే కొలీజియం వ్యవస్థ ద్వారానే న్యాయమూర్తుల నియామకం జరగాలని ఆదేశించింది. న్యాయమూర్తుల నియామకాలు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడి ప్రభుత్వం కొలీజియం వ్యవస్థను రద్దు చేసి నేషనల్ జుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఇందులో రాజకీయ జోక్యం ఎక్కువవుతుందని కొందరు వ్యక్తులు సుప్రీంకోర్ట్‌లో సవాల్ చేయటంతో ఇవాళ్టి తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థకు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడినట్లయింది. అయితే ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబాల్, రాంజెత్మలాని, ప్రశాంత్ భూషణ్ ఈ తీర్పును సమర్థించటం విశేషం.