లోక్ సత్తా పేరుతో స్వచ్చంద సంస్థనో.. సామజిక సేవా సంస్థనో.. రాజకీయ పార్టీనో పెట్టి.. మేధావి గ్రూప్ లో వ్యక్తిగా పేరు తెచ్చుకున్న జయప్రకాష్ నారాయణను ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మూడు రోజుల కిందట విజయవాడలో ఆప్కాబ్ కార్యక్రమం ఒకటి జరిగింది. దీనికి సీఎం జగన్ రెడ్డి మఖ్య అతిథి. జేపీ కూడా హాజరయ్యారు. జేపీ ఆలస్యంగా వస్తే స్టేజ్ మీద ఉన్న జగన్ రెడ్డి లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారు. పక్క పక్క కూర్చుని ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు.
బయట నీతులు చెప్పే జేపీ ఇక్కడ చేస్తున్నదేమిటని ఒక్క సారిగా సోషల్ మీడియా బ్లాస్ట్ అయిపోయింది. ఆ తర్వాత జగన్ రెడ్డి ఆయనను పార్టీలోకి ఆహ్వానించేశారని.. ఆయనకు బెజవాడ టిక్కెట్ ఖరారు చేసేశారని ప్రో వైసీపీ మీడియా ప్రచారం ప్రారంభించింది. సమాజంలో కాస్త మేధావులు అనే వారిని ఎలా ఉపయోగించుకోవాలో జగన్ రెడ్డికి బాగా తెలుసు. గతంలో చిరంజీవి ఒక్కడ్నే ఇలా విందుకు పిలిచి.. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరబోతున్నాడని రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నట్లుగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఒక షేక్ హ్యాండ్ తో జేపీపైనా అదే ప్రచారం చేస్తున్నారు.
జేపీకి రాజకీయంగా చాలా ఆశలు ఉన్నాయి. ఒక్క సారి కూకట్ పల్లిలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పని తీరు దెబ్బకు తర్వాత మరోసారి ఎన్నుకోలేదు. సమయం, సందర్భం వచ్చినప్పుడు మోడిని పొగుడుతారు.. ఒక్కో సారి వివాదాస్పద అంశాల్లోనూ మద్దతు పలుకుతారు. అయినా బీజేపీ వాళ్లు ఆయన వైపు చూడలేదు. కానీ జగన్ రెడ్డి ఆయన వస్తానంటే మాత్రం టిక్కెట్ ఇస్తారు. ఇలాంటి వాళ్ల ఇమేజ్ తోలు వలిచి.. తమ మీద వేసుకుని… ఎన్నికలకు వెళ్లడం జగన్ రెడ్డి వంటి వాళ్లకు వెన్నతోపెట్టిన విద్య. అయితే జేపీ బలి పశువు అవుతాడా.. ఏదో ఓ పార్టీ టిక్కెట్ కోసం ఆయన అంతగా చకోరపక్షిలా చూస్తున్నారా అన్నది సందేహం.
అయితే ఎక్కువ మంది ఆయన జగన్ కార్యక్రమంలో పాల్గొని షేక్ హ్యాండ్ ఇవ్వడాన్నే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పార్టీలో చేరితే ఊరుకుంటారా.. ఇలా అంటూ జరిగితే ఆయన ఇంత కాలం సంపాదించుకున్న ఇమేజ్ అంతా.. జగన్ రెడ్డి పార్టీలో కలిసిపోయినట్లేనని అనుకుంటున్నారు.