నటుడన్నాక ప్రతి ఒక్కరికీ ఒక్కసారైనా `హీరో` అనిపించుకోవాలని ఉంటుందేమో..? అందుకే ఏదో ఓ రూపంలో ఆ ముచ్చట తీర్చుకుంటూ ఉంటారు. ఎన్నో సినిమాల్లో విలన్‌గా భయపెట్టి, హాస్య నటుడిగా నవ్వించి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన జయప్రకాష్‌రెడ్డి కూడా ఇప్పుడు హీరో అయిపోయారు. ఆయనేంటి? ఈ వయసులో హీరో ఏంటి? అనుకోవొచ్చు. కాకపోతే ఇది నిజం. షూటింగ్ కూడా అయిపోయింది. ఈ చిత్రానికి ధవళ సత్యం దర్శకత్వం వహించారు. సినిమా పేరు.. `అలెగ్జాండర్`. అన్నట్టు ఈ చిత్రానికి నిర్మాత కూడా జేపీనే.
మరో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఆయనొక్కరే కనిపిస్తారు. అంటే ఏక పాత్రాభినయం అన్నమాట. నిజానికి ఈ సినిమా వెనుక చాలా స్టోరీ ఉంది. జేపీ నాటక రంగం నుంచి వచ్చారు. `అలెగ్జాండర్` అనే ఏక పాత్రాభినయానికి ఆయన పెట్టింది పేరు. వందలాది ప్రదర్శనలు ఇచ్చి, ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. ఆ నాటకాన్నే ఇప్పుడు సినిమాగా తీసుకొస్తున్నారు. స్టేజీపై మెప్పించిన ఈ ఏక పాత్రాభినయం.. వెండి తెరపై ఏమాత్రం వెలుగుతుందో చూడాలి. ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలు సఫలం అయితే.. నాటక రంగం నుంచి మరిన్ని ప్రయత్నాల్ని చూడొచ్చు.