నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్లు.. ఆ తరవాత నాటకాల వంక కన్నెత్తి కూడా చూడరు. ఓ మెట్టు పైకి ఎక్కాక, మళ్లీ కిందకి దిగడం ఎందుకులే.. అనుకుంటారు. కానీ… జయప్రకాష్ రెడ్డి అలా కాదు. సినిమాల్లోకి వచ్చినా, నాటకాల వదల్లేదు. సినిమాలకు ఉండే క్రేజ్ నాటకాలకు ఉండదని తెలిసినా… ఆయన చివరి క్షణం వరకూ నాటకాలు వేస్తూనే ఉన్నారు. ఆయన హైదరాబాద్, కర్నూలు వదిలి.. గుంటూరులో ఉంటున్నది నాటకాల కోసమే. అక్కడే ఆయన తుది శ్వాస విడవడం.. యాదృచ్చికం. దైవ నిర్ణయం.
జయప్రకాష్ రెడ్డికి ఎంతో పేరు తెచ్చిన నాటకం.. `అలెగ్జాండర్`. ఇది ఏక పాత్రతో సాగే నాటకం. కొన్ని వందల సార్లు ప్రదర్శించారు. ఎప్పుడు ఎక్కడ ఈ నాటకాన్ని ప్రదర్శించినా ఉత్తమ నటుడు పాత్ర.. జయప్రకాష్ రెడ్డికే సొంతం. తొలి సినిమాలో అవకాశం రావడం వెనుక కూడా ఈ నాటకం పాత్ర ఉంది. అందుకే.. ఆయన నాటక రంగ అలెగ్జాండర్. ఈ నాటకాన్ని సినిమాగా తీద్దామనుకున్నారు జయప్రకాష్ రెడ్డి. నటుడు, దర్శకుడు రెండూ ఈయనే. ఆ ప్రయత్నం మొదలు పెట్టారు కూడా. షూటింగు కూడా పూర్తయింది. విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఓ మంచి నటుడికి, నాటక రంగంలో ఇంత సేవ చేసిన వ్యక్తికి గుర్తింపుగా.. ఆ సినిమాని కనీసం ఏటీటీలో అయినా విడుదల చేస్తే బాగుంటుంది. ఓ కళాకారుడికి అది నిజమైన నివాళిగా మిగులుతుంది.