కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాజకీయ వేడి తారస్థాయికి చేరుకుంది. టీఆర్ఎస్ మినహా ఇప్పటివరకు ఏ పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. కానీ అనధికారికంగా అభ్యర్థులెవరన్నదానిపై క్లారిటీ వచ్చేసినట్లే. కార్యకర్తలతో పాటు నాయకులు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జిల్లాలోని ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో అధికార పార్టీ టికెట్లు ప్రకటించిన తర్వాత అసమ్మతి బెడద పెరిగింది. చందూలాల్‌కు ములుగు నుంచి టీఆర్ఎస్ టికెట్ ప్రకటించగా.. ఏజెన్సీ ప్రాంతం కావడం.. ఆదివాసీల ప్రాబల్యం అధికంగా ఉండడంతో వారికే అవకాశం కల్పించాలని ఆ పార్టీకి చెందిన అసమ్మతి నేతలు పట్టుపడుతున్నారు. మంత్రిగా ఉన్న చందూలాల్ తమను పట్టించుకోలేదని, ఆయన కుమారుడి అరాచకాలతో వేగలేకపోతున్నామని.. అభ్యర్థిని మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని.. పార్టీ మారే ఆలోచనే లేదని స్పష్టం చేస్తున్నారు.
ములుగు కాంగ్రెస్‌లో ప్రస్తుతం రెండు వర్గాలు ఉన్నాయి. పొదెం వీరయ్య, సీతక్క నాయకత్వాల వారీగా విడిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి స్తబ్ధుగా ఉన్నా పార్టీ నుంచి టికెట్‌పై స్పష్టత వచ్చిన తర్వాత అసంతృప్తులు వేరే పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పొదెం వీరయ్య బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే సీతక్క మాత్రం పొదెం వీరయ్యతో కలిసి పనిచేస్తానని, ఎవరికి టికెట్ వచ్చినా మహాకూటమి అభ్యర్థినే గెలిపించుకుని తీరుతామని చెబుతున్నారు. భూపాలపల్లి విషయానికి వస్తే టీఆర్ఎస్ టికెట్ స్పీకర్ మధుసూదనాచారికి కేటాయించారు. అదే పార్టీలోని నాయకుడు గండ్ర సత్యనారాయణరావు టికెట్ ఆశించి దక్కకపోవడంతో రెబల్‌గా బరిలో ఉంటానని స్పష్టంచేసి ప్రచారం సైతం ప్రారంభించారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి తమ నాయకుల వెంటే ఉంటున్నారు. కాంగ్రెస్ తరఫున గండ్ర వెంకటరమణారెడ్డి, , బీజేపీ తరపున కీర్తిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు.
మంథనిలో సిట్టింగ్ ఎమ్మెల్యే పుట్టా మధుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున దుద్దిళ్ల శ్రీధర్ బాబు పోటీ చేయనున్నారు. భద్రాచలం నియోజకవర్గాల్లో మహాకూటమి తరపున ఏ పార్టీకి సీటు వెళ్తుందన్న క్లారిటీ లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వలసల జోరు కామన్ గా ఉండాల్సింది పోయి.. ఇప్పటివరకు భూపాలపల్లి జిల్లాలో ఆ పరిస్థితే కనిపించడం లేదు. పొత్తులు ఖరారై.. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాజకీయంగా.. భూపాలపల్లి జిల్లాలో అలజడి రేగే అవకాశం కనిపిస్తోంది.