జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్యహత్య ప్రస్తుతం చిత్రసీమలో సంచలనం గా మారింది. నితిన్ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారు? అందుకు గల కారణాలేంటి?? అనే విషయాలు తెలియకపోయినా… విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నితిన్ మానసిక పరిస్థితి కొంతకాలంగా బాగోలేదని తెలుస్తోంది. ఓ మానసిక నిపుణుడి ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు కూడా. అందుకోసమే ఆయన ముంబైలో ఉండిపోయారు. గతంలో కొన్నిసార్లు ఇలానే ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవాలని చూశారని. సకాలంలో కుటుంబ సభ్యులు స్పందించడం వల్ల ఆయన్ని కాపాడుకోగలిగారని తెలుస్తోంది. ముంబైలోని అంథేరీ ప్రాంతంలో ఆయన ఒంటరిగానే ఉంటున్నారు. ఆర్థికంగా నితిన్ బాగా చిదికి పోయారని, ఆ బాధని ఆయన దిగమింగుకోలేకపోతున్నారని తెలుస్తోంది.
గతంలో ఓసారి హైదరాబాద్లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. మంటల్లో కారు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారాయన. నాలుగేళ్లు గడిచాయో లేదో.. మృత్యువు మరో రూపంలో కబళించింది. నితిన్ మృతిపై ముంబై పోలీసులు కూడా ఇప్పటి వరకూ స్పష్టమైన సమాచారం ఏమీ ఇవ్వలేదు. ప్రాధమిక ఆధారాల్ని బట్టి చూస్తే ఆత్మహత్య అనిపిస్తోందని, అయితే విచారణ జరుగుతోందని చెబుతున్నారు. నితిన్ కపూర్ ఓ నిర్మాత కూడా. జయసుధతో 8 చిత్రాల్ని రూపొందించారు. అందులో 3 హిట్స్ కూడా ఉన్నాయి. అయితే హ్యాండ్సప్ అనే చిత్రంతో భారీ నష్టాల్ని మూటగట్టుకోవాల్సివచ్చింది. ఆ సినిమాతో ఆస్తులన్నీ అమ్ముకొన్నామని జయసుధ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.