ప్రముఖ నటి, మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెదేపాలో చేరినపుడు, వైకాపాలో ‘పెద్ద నోరున్న’ మహిళా నేతగా పేరొందిన రోజాను నిలువరించేందుకేననే ఊహాగానాలు వెలువడ్డాయి. ఎందుకంటే రోజా తెదేపాని వీడి వైకాపాలో చేరినప్పటి నుండి నేరుగా చంద్రబాబు నాయుడునే లక్ష్యంగా చేసుకొని చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నా కూడా తెదేపాలో ఆమెకు ధీటుగా సమాధానం చెప్పగల మహిళా నేతలు ఎవరూ లేరు. నన్నపునేని రాజకుమారి, అలనాటి నటి కవిత తదితరులు ఉన్నా వారికి పార్టీలో సముచిత స్థానం,గౌరవం దక్కడం లేదనే అసంతృప్తితో చాలా కాలంగా పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అనిత వంటి కొందరు మహిళా ఎమ్మెల్యేలు, పరిటాల సునీత, మృణాలిని వంటి మంత్రులు ఉన్నప్పటికీ వారెవరూ రోజా నోటి ధాటిని తట్టుకోలేరని స్పష్టమయింది. పైగా రోజాలాగ వారెవరికీ సినీ గ్లామర్ కూడా లేదు.
సరిగ్గా ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో జయసుధ తెదేపాలోకి రావాలనుకోవడంతో, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆలస్యం చేయకుండా ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. కానీ రోజా, జయసుధల ఆలోచన, వ్యవహార శైలి, మాట తీరులో చాలా వ్యత్యాసం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. జయసుధ సామాజిక సేవ, ప్రజా సేవ పట్ల చాలా చిత్తశుద్దితో పనిచేస్తారని మంచి పేరుంది. అలాగే ఆమె ఎవరినీ నొప్పించకుండా చాలా మృదువుగా మాట్లాడుతారని తెలుసు. వర్తమాన రాజకీయాలకి ఏ మాత్రం సరిపోని సున్నితత్వం కూడా ఆమెలో ఉంది. కనుక ఆమె రోజా నోటికి తాళం వేయగలరా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే ప్రశ్న ఆమెను అడిగినప్పుడు “నన్ను ఆమెతో పోల్చడం సరికాదు. ఒక మహిళగా నేను ఆమె స్థాయికి దిగి మాట్లాడలేను కానీ అవసరమయినప్పుడు నా స్థాయికి, నా పద్దతికి తగినట్లుగా నా పరిధిలో స్పందిస్తాను. తుపాకి పేలినప్పుడు పెద్దగా శబ్దం రావడం సహజమే. కానీ సైలన్సర్ బిగించిన తుపాకిని ప్రయోగించినప్పుడు పెద్ద శబ్దం రాకపోయినా అదే ఫలితం కనబడుతుంది,” అని సమాధానం ఇచ్చేరని తాజా సమాచారం. అంటే ఆమె రోజాతో సమానంగా పోటీపడుతూ నిత్యం మీడియా ముందుకు వచ్చి వైకాపాపై విమర్శలు, ప్రతివిమర్శలు చేయబోనని జయసుధ చెపుతున్నారనుకోవాలి. కానీ ఆమె సైలన్సర్ బిగించిన తుపాకీలాగా ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.