ప్రముఖ సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్లో..జగన్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముంబైలో భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత దాదాపుగా .. బయట కనిపించడం మానేశారు. సినిమాలు కూడా పరిమితంగా చేస్తున్నారు. ఈ తరుణంలో హఠాత్తుగా ఆమె వైసీపీలో చేరారు. నిజానికి ఆమె 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఊరకనే కండువా కప్పుకున్నారు కానీ.. తర్వాత ఎక్కడా ఎలాంటి కార్యక్రమాల్లోనూ కనిపించలేదు. ఆ తర్వాత వ్యక్తిగత జీవింతలో ఇబ్బందులు రావడం.. తో యాక్టివ్ కాలేకపోయారు. జగన్ ఆదేశిస్తే.. ఏపీ ఎన్నికల్లో ఎక్కడి నుంచయినా కచ్చితంగా పోటీ చేస్తానని జయసుధ ప్రకటించారు.
టీఆర్ఎస్ ఒత్తిడితో వైసీపీలో చేరలేదని.. వైసీపీలోచేరేందుకు తనపై ఎవరి ఒత్తిడి లేదని.. వివరణ ఇచ్చారు. తనకు సినిమా తప్ప ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు. వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఓ రకంగా సొంత ఇంటికి చేరినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీలో జాయిన్ అయ్యాను కానీ నేనేం చేయాలి.. నా విధులు ఏంటో ఎవరూ చెప్పలేదని … కాంగ్రెస్లో చేరినప్పుడు నేను ఎలా ఉండాలి..
ఏం చేయాలన్నది వైఎస్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ సీటు ఇచ్చి వైఎస్ ప్రోత్సహించారన్నారు. కాంగ్రెస్ తరపున గతంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి… తలసాని శ్రీనివాసయాదవ్పై జయసుధ విజయం సాధించారు.
కొడుకును హీరోగా పరిచయం చేసినప్పటి నుంచి…టీఆర్ఎస్తోనూ జయసుధకు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రోజూ ఎవరో ఒకర్ని చేర్పించుకునే వ్యూహంలో భాగంగా.. జయసుధకు కూడా కండువా కప్పారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆమెకు టిక్కెట్ ఖరారు చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.