కిరణ్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి బీజేపీలోకి చేరికలు ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో కీలకంగా ఉండి ఇప్పుడు ఏ ప్రాధాన్యత లేకుండా పోయిన కొంత మంది నేతల్ని కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేర్చుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డితో పాటు మరికొంత మంది జిల్లా స్థాయి నేతల్ని తీసుకుని ఢిల్లీ వెళ్తున్నారు. జయసుధను కూడా బీజేపీలోకి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని జయసుధ కలిశారు. జయసుధ బీజేపీలో చేరే ఉద్దేశంతోనే కలిసినట్లుా చెబుతున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు. తర్వాత ఓడిపోయారు. ఇక సైలెంట్ అయిపోయారు. వ్యక్తిగత సమస్యలతో కొన్నాళ్లుగా సినిమాలకూ దూరంగా ఉంటున్నారు. ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో వైసీపీలోనూ చేరారు. గత ఎన్నికలకు ముందు తీవ్ర ఒత్తిడి రావడంతో వైసీపీలో చేరారు.
ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం కిషన్ రెడ్డి కనుసన్నల్లోనే ఉంటుంది. క్రిస్టియన్స్ ఎక్కువ ఉండే నియోజకవర్గం కావడం.. వారిలో జయసుధకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండటంతో.. ఈ సీటు ఆఫర్ చేసి పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.