అనంతపురం జిల్లా బ్రదర్స్ జేసీ బ్రదర్స్ తమకు తాము టిక్కెట్లు ప్రకటించేసుకున్నారు. అయితే … జేసీ బ్రదర్స్ లో పెద్ద జేసీ … దివాకర్ రెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన స్థానంలో కొడుకు.. అనంతపురం ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించారు. చిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం… రిటైర్మెంట్ తీసుకోవడం లేదు కానీ… దాదాపుగా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఆయన తాడిపత్రి కౌన్సిలర్ గా మాత్రమే పోట చేస్తారట. ఆయన కుమారుడు తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. తాజాగా దివాకర్‌రెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇచ్చారు.
తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేస్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని స్పష్టం చేశారు. జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి ఇప్పటికే రాజకీయంగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ టీడీపీ శ్రేణులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ద్వారా తాడిపత్రి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
లోకేష్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న జేసీ బ్రదర్స్ వారసులు కూడా రాజకీయంగా తమను తాము నిరూపించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చంద్రబాబు జేసీ సోదరుల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో కానీ.. వారు మాత్రం ముందస్తుగా.. అభ్యర్థులుగా… ప్రకటించేసుకున్నారు. ఏ పార్టీలో ఉన్న వారి స్టైల్ వారిదే..!