ఏపీలో మూడు రాజధానులు చిచ్చు మొదలైనప్పటినుంచి నాయకులు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. నానా విధాలుగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న కొన్ని ప్రకటనల్లో సీరియస్‌నెస్ ఎంతో తెలియదు. కొందరు నాయకులు చేస్తున్న ప్రకటనలు, మాట్లాడుతున్న తీరు చూస్తుంటే వారు సీరియస్‌గా మాట్లాడుతున్నారో, ఏదో రాజకీయ కక్షతో మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు. మూడు రాజధానులు కాన్సెప్టుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ముఖ్యమంత్రి జగన్‌కు దీంట్లో రెండో ఆలోచన లేదు. టీడీపీ, ఇతర ప్రతిపక్షాలది అమరావతి దారి. అయితే టీడీపీలో భిన్నాభిప్రాయాలున్నాయి.
ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు విశాఖపట్టణం రాజధానిగా సమర్థిస్తున్నారు. ఇక రాయలసీమ నాయకుల్లో కొందరు ఉంచితే అమరాతిని రాజధానిగా ఉంచండి లేదా కర్నూలును రాజధానిగా చేయండి అంటున్నారు. మరి కొందరు అమరావతిని రాజధానిగా కొనసాగించండి లేదా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఇవ్వండని డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటించిన మరుక్షణం నుంచే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ప్రారంభం చేస్తామని చెబుతున్నారు. విశాఖపట్టణాన్ని వ్యతిరేకించే రాయలసీమ నేతలు చెబుతున్న ప్రధాన కారణం అది చాలా దూరమని.
తాజాగా టీడీపీ మాజీ ఎంపీ, ఈమధ్య బస్సుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి జగన్ మీద ఫైరయ్యాడు. జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టాడని, అమరావతి గురించి అసత్య ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డాడు. గత 75 ఏళ్లలో అమరావతికి వరదలొచ్చిన దాఖలా లేదన్నాడు. ఉంచితే అమరావతినే రాజధానిగా ఉంచాలని, లేదంటే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించాడు. ఈ సందర్భంలోనే ఆసక్తికరమైన విషయం చెప్పాడు. రాజధానిగా అమరావతిని కాదంటే కర్నూలును రాజధానిగా చేయాలని చాలామంది సీమ నేతలు అంటున్నారు కదా.
అలనాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఇదే కరెక్టు అంటున్నారు. కాని జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ‘అమరావతిని రాజధానిగా ఉంచకపోతే కడపను రాజధానిగా చేయాలి’ అన్నాడు. కడప సీఎం జగన్ సొంత జిల్లా. కాని ఆయనే ఎప్పుడూ కడప ఆలోచన చేయలేదు. కాని జేసీ ఎందుకు చేశాడు? రాయలసీమలోని కడపను రాజధానిగా చేస్తే అది రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉంటుందట…! అంటే అమరావతి మాదిరిగానేనన్నమాట. కాబట్టి అమరావతి వద్దంటే కడపనే రాజధాని చేయాలంటున్నాడు. అదీ కాకపోతే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తాడట.
మరి రాయలసీమ నాయకుల్లో ఎంతమంది జేసీ ఆలోచనను సమర్థిస్తారో. ఇక ప్రకాశం జిల్లావారు తమ జిల్లాకు రాజధాని ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ దొనకొండలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు. జీఎన్‌రావు కమిటీ విజయనగరంలో రాజధాని ఏర్పాటు చేయాలంది. ఇలా రాజధానిపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. ఈ కథ ఇలా నడుస్తుండగా జగన్ కేబినెట్లో ఉన్న హౌసింగ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు ఓ ఆలోచన వచ్చింది.
మూడు రాజధానుల ప్లాన్ బాగానే ఉందిగాని మరో రాజధాని జగన్ మర్చిపోయారని ఈయన అనుకున్నాడు. ఇంతకూ ఏమిటది? ‘సాంస్కృతిక రాజధాని’.అంటే కల్చరల్ కేపిటల్. కల్చరల్ కేపిటల్ లేకపోతే ఆంధ్రజాతికి కల్చర్ లేదని అనుకుంటారేమోనని శ్రీరంగనాథ రాజుకు సందేహం కలిగింది. కల్చరల్ కేపిటల్‌ను రాజమండ్రి (రాజమహేంద్రవరం) లో పెట్టాలని చెప్పాడు ఈ ప్రతిపాదనను అసెంబ్లీలోనే జగన్‌కు చెబుతానని అన్నాడు. రాజధానుల రచ్చ మీద ఎవరి గొడవ వారిది…!