దీపావళి పండుగలో రకరకాల బాంబులు పేలుతుంటాయి. కొన్ని రకాల బాంబులు ఒకసారి అంటిస్తే ఆగాగి మళ్ళీ మళ్ళీ పేలుతుంటాయి. మన రాజకీయానేతల్లో కూడా ఆవిధంగా బాంబులు పేల్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిలో తెదేపా ఎంపి జేసి దివాకర్ రెడ్డి కూడా ఒకరు. ఆయన పేరుకి తెదేపా నేత అయినా ఎప్పుడు తెదేపాకు చురకలు వేస్తారో ఎప్పుడు తెదేపాను వెనకేసుకొచ్చి ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన ప్రతిపక్షాల మీద కంటే తన స్వంత పార్టీ మీద, తాము భాగస్వామిగా ఉన్న కేంద్రం మీదే ఎక్కువగా విమర్శలు గుప్పిస్తుంటారు.
నిన్న అనంతపురం జిల్లాలో గుంతకల్లులో మీడియాతో మాట్లాడుతూ “కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన తీరు ఇదేవిధంగా సాగుతునట్లయితే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హైదరాబాద్-అమరావతికి మధ్య తిరగడానికే సరిపోతోంది. అభివృద్ధి పధకాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి ఆచరణలో ఒక్కటీ కనబడటం లేదు. రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కేంద్రం అరకొరగా విదిలించే నిధులతో ఏ పనులు జరగడం లేదు. రాష్ట్రానికి దమ్మిడీ ఆదాయం లేకపోయినా ఖర్చులు మాత్రం చాలా జోరుగానే సాగుతున్నాయి. ఇకనయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనకపోతే భవిష్యత్ అగమ్యగోచరంగా తయారవుతుంది. రాయలసీమ జిల్లాలకు చెందిన కొందరు రాజకీయ నిరుద్యోగులు తమ రాజకీయ మనుగడ కోసమే ప్రజలను రెచ్చగొట్టి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను లేవదీయాలని ప్రయత్నిస్తున్నారు,” అని అన్నారు.
జేసి దివాకర్ రెడ్డి తరచూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం కొత్తేమీ కాకపోయినప్పటికీ ఆయన చేస్తున్న విమర్శలను చంద్రబాబు నాయుడు, రాష్ట్ర బీజేపీ నేతలు గానీ పట్టించుకోకపోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే వేరెవరయినా నేతలు ఈవిధంగా మాట్లాడి ఉండి ఉంటే ఏమయ్యేదో..అందరూ మూకుమ్మడిగా ఏవిధంగా ఆ నేత మీద ఎదురుదాడి చేసి ఉండేవారో అందరికీ తెలుసు. కానీ జేసి దివాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వలన పార్టీకి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడా చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఎదుర్కోవలసివస్తున్నా తెదేపా నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మౌనం వహించడమే విశేషం. అందుకు కారణం ఏమిటో?