కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని మోడీని ఢీ కొట్టే కూటమి దిశగా మరో కీలకమైన అడుగుగా ఈ భేటీని చెప్పొచ్చు. అయితే, ఈ భేటీ నేపథ్యంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు. నిజానికి, ఆయన మొదట్లో కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు కదా! ఆ పార్టీని వదిలి టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు టీడీపీ కూడా సిద్ధమౌతున్న నేపథ్యంలో మీడియాతో జేసీ మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తు లేదనీ, కానీ జాతీయ స్థాయి ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని తాము మద్దతు ఇవ్వక తప్పడం లేదన్నారు జేసీ. మోడీ రాక్షస పాలన నుంచి తప్పించడానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి అన్నారు. చంద్రబాబు, రాహుల్ భేటీతో మోడీ పతనం ప్రారంభమైందన్నారు. వల్లభాయ్ పటేల్ విగ్రహం మీద ఆంధ్రప్రదేశ్ పేరే లేనప్పుడు… తెలుగు ప్రజలకు భాజపాకి ఎలా ఓటేస్తారని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా కక్ష సాధింపు మనిషి అనీ, ఏదో జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయి నేతగా ఆయన ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీతో భేటీకి ముందు తమతో ముఖ్యమంత్రి మాట్లాడారనీ, రాహుల్ నాయకత్వాన్ని బలపరచాలనే అభిప్రాయాన్ని తెలిపామన్నారు.
అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో స్నేహం వద్దనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో ఎమ్మెల్యే సీట్లు పంచుకోవడం లాంటివి వద్దని సూచించామన్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేసే పరిస్థితి ఉండదన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ తో భాయీ భాయీ అనీ, ఉదర్ నహీ హే అన్నారు జేసీ! రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు భేటీ నేపథ్యంలో… దాని ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో ఏంటనే చర్చను ఓరకంగా జేసీ మొదలుపెట్టేశారనే అనుకోవచ్చు. ఈ కొత్త స్నేహం ఢిల్లీ వరకూ పరిమితం, రాష్ట్రంలో ఉండదని చెబుతున్నా… దీనిపై కొంత చర్చ అయితే జరుగుతుంది. ఒక స్పష్టమైన విధానం అవసరమౌతుంది. అయితే, ఈ చర్చకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ, ఈలోగానే జేసీ ఆగరు కదా..!